Kerala CM: కేరళ గవర్నర్ పై సీఎం ఆగ్రహం !
కేరళ గవర్నర్ పై సీఎం ఆగ్రహం !
Kerala CM: రాజ్యంగా బద్దమైన పదవిలో ఉండి కూడా నడి రోడ్డుపై నిరసనకు దిగడంపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పై సీఎం పినరయి విజయన్ అసహనం వ్యక్తం చేసారు. అధికారంలో ఉన్న వ్యక్తులపై నిరసనలు చేపట్టడం చాలా సహజమని… అలాంటి సమయంలో ప్రతిస్పందించే ముందు తన స్థాయిని గుర్తుపెట్టుకోవాలని గవర్నర్ కు సీఎం విజయన్ సూచించారు. నా కాన్వాయ్ ను అడ్డుకుని చాలా సార్లు ప్రజాసంఘాలు నిరసనలు చేపట్టాయి… కానీ ఇలా ఎప్పుడు నేను కారు నుంచి దిగిపోలేదన్నారు. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించడం దేశంలో ఎన్నడూ జరగలేదన్నారు. గతంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ ఆరిఫ్… కేరళ పోలీసులపై ప్రశంసలు కురిపించిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. అలాంటి కేరళ పోలీసులు కల్పించే భద్రత ఆయనకు సరిపోదా అని ఎద్దేవా చేసారు.
Kerala CM Viral
‘‘ప్రస్తుతం కేరళలో సీఆర్పీఎఫ్ పాలన కొనసాగుతోందా ? ఈ సాయుధ దళాలు కేసు నమోదు చేస్తాయా ? రాష్ట్రంలో ఆ దళాలను మోహరించడం విచిత్రంగా ఉంది. పోలీసులు పద్ధతి ప్రకారం నడుచుకోవడం లేదని గవర్నర్ ఆరోపించారు. మరి ఇప్పుడు ఆయన కోరుకున్న విధంగా సీఆర్పీఎఫ్ వ్యవహరిస్తుందా ?’’ అని సీఎం ప్రశ్నించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు.
కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, సీఎం పినరయ్ విజయన్ ల(Kerala CM) మధ్య చాలాకాలంగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ప్రభుత్వం పంపించే బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడం, యూనివర్సిటీ నియామకాల్లో ప్రభుత్వ జోక్యం వంటి అంశాలపై ఇద్దరి మధ్యా భేదాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే కొల్లం జిల్లా నీలమేల్ లో గవర్నర్ తీరుకు నిరసనగా అధికార సీపీఎం పార్టీ అనుబంధ సంస్థ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నల్ల జెండాలను ప్రదర్శించారు. దీనితో తన కాన్వాయ్ వెళ్తుండగా నిరసన తెలిపిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేయాలని రోడ్డు పక్కన కూర్చొని గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ నిరసన తెలిపారు. ఇప్పటికే 13 మందిని అరెస్టు చేసామని పోలీసులు చెప్పినప్పటికీ… మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల తీరుపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. దీనితో గవర్నర్ కాన్వాయ్ ను నిరసన కారులు అడ్డుకున్న నేపథ్యంలో గవర్నర్ భద్రతను పెంచుతూ కేంద్ర హోం శాఖ జడ్ ప్లస్ కేటగిరి కేటాయించింది.
Also Read : YS Sharmila : ఎవరికీ భయపడేది లేదు.. నాది వైఎస్ఆర్ వారసత్వమే