Mephedrone: ఢిల్లీ, పుణేలో రూ.2,200 కోట్ల విలువైన ‘మెఫెడ్రోన్’ డ్రగ్ సీజ్ !
ఢిల్లీ, పుణేలో రూ.2,200 కోట్ల విలువైన ‘మెఫెడ్రోన్’ డ్రగ్ సీజ్ !
Mephedrone: మహారాష్ట్ర, ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్న అక్రమ ‘మెఫెడ్రోన్’ (మియావ్ మియావ్) వ్యాపారం గుట్టు రట్టు చేసారు పూణే, ఢిల్లీ పోలీసులు. పూణే, ఢిల్లీ నగరాల్లో వేరువేరు చోట్ల సోదాలు నిర్వహించి సుమారు 1100 కేజీల మెఫెడ్రోన్ ను సీజ్ చేసారు. పోలీసులు సీజ్ చేసిన మెఫెడ్రిన్ విలువ బహిరంగ మార్కెట్ లో రూ.2,200 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మెఫెడ్రోన్ అక్రమ వ్యాపారం వెనుక ఉన్న పలువురు ఫార్మా కంపెనీల ఓనర్లను, ఇంజనీర్లను అరెస్టు చేసి వారిపై ఎన్డీపీఎస్ చట్టం క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వీరి వెనుక మరికొంతమంది విదేశీయులు, భారత సంతతికి చెందిన విదేశీయులు ఉన్నట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది.
Mephedrone Drug Case Viral
‘మెఫెడ్రోన్’ రాకెట్ అరెస్టుపై పూణే అడిషినల్ పోలీస్ కమిషనర్ శైలేష్ బాల్కవాడే మాట్లాడుతూ… ‘‘పుణేకు 75 కిలోమీటర్ల దూరంలోని షోలాపుర్ వద్ద కుర్ కుంభ సమీపంలోని ఓ ఫార్మాస్యూటికల్ ప్లాంట్ లో నిల్వ ఉంచిన 700 కేజీల మెఫెడ్రోన్(Mephedrone) డ్రగ్‌ను సీజ్ చేశాము. ఈ కేసులో ఆ ఫార్మా ప్లాంట్ ఓనర్‌ను అరెస్టు చేశాము. భీంజీ అలియాస్ అనిల్ పరశురాం, కెమికల్ ఇంజినీర్ యువరాజ్ బబన్ భుజ్భాయ్కు దీనితో సంబంధం ఉన్నట్లు మా ప్రాధమిక విచారణలో తేలింది. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా మా బృందం ఢిల్లీ వెళ్లి స్థానిక పోలీసుల సాయంతో అక్కడ హౌజా ఖాస్ ఏరియాలో మరో 400 కేజీల మెఫెడ్రోన్ ను సీజ్ చేసాము. ఈ రాకెట్లో కొందరు విదేశీయులు, విదేశాల్లోని భారతీయుల హస్తం కూడా ఉన్నట్లు తాము గుర్తించామని పోలీస్ కమిషనర్ చెప్పారు. డగ్స్‌ను ప్యాక్ చేయడానికి నిందితులు ఉప్పు గోదాములను వినియోగించినట్లు పేర్కొన్నారు. ఫార్మా కంపెనీ యజమాని, ఈ డ్రగ్ మాఫియా మాస్టర్ మైండ్ మధ్య సంబంధాలు ఎలా మొదలయ్యాయో గుర్తించేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మెఫెడ్రోన్ తయారీ, విక్రయంపై పూర్తిస్థాయిలో నిషేధం ఉంది. దీనిని ఉల్లంఘిస్తే ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేయవచ్చు. ప్రస్తుతం స్వాధీనం చేసుకొన్న మాదక ద్రవ్యాన్ని కుర్ కుంభ నుంచి ఢిల్లీలోని స్టోరేజీ పాయింట్లకు తరలించి భద్రపరుస్తున్నారు. తాజా దాడుల్లో వీటి సరఫరా దారులను అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి మరో రూ.3.58 కోట్లు విలువైన మెఫెడ్రిన్ను ఉన్నట్లు గుర్తించారు.
Also Read : Farmers Protest : ఈరోజు ఉదయం 11 గంటలలోపు కేంద్రం స్పందించకుంటే ఇక ఢిల్లీ యాత్రే – రైతులు