APPSC: గ్రూప్-1 మెయిన్స్ సింగిల్ జడ్జి తీర్పుపై హైకోర్టు స్టే !
గ్రూప్-1 మెయిన్స్ సింగిల్ జడ్జి తీర్పుపై హైకోర్టు స్టే !
APPSC: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రద్దుపై గురువారం ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తాత్కాలిక స్టే విధిస్తూ.. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవాళ్లు యధావిధిగా కొనసాగుతారని డివిజన్ బెంచ్ ఊరట ఇచ్చింది. గ్రూప్ -1 మెయిన్స్‌ను రద్దు చేస్తూ ఇటీవల సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. మెయిన్స్ రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని అందులో పేర్కొన్నారు. దీనిపై ఏపీపీఎస్సీ, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేశాయి. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. తాజాగా స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది.
APPSC Update
2018లో గ్రూప్ 1 క్రింద 167 పోస్టులకి ఏపీపీఎస్సీ(APPSC) నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఎంపికలో అవకతవకలు జరిగాయని, మూడుసార్లు మూల్యాంకన జరిగిందని కొందరు అభ్యర్థులు ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. మరోవైపు… హైకోర్టు ఆదేశాలతో డిజిటల్ మూల్యాంకన రద్దు చేసి ఒకసారి మాత్రమే మాన్యువల్ గా మూల్యాంకన చేశామని వాదనలు వినిపించింది ఏపీపీఎస్సీ బోర్డు. ఇరువర్గాల వాదనలు విన్న సింగిల్ జడ్జి బెంచ్ మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. మే 26, 2022న APPSC ప్రకటించిన ఉద్యోగుల జాబితాను తిరస్కరించింది.
దీనితో… ఆ నోటిఫికేషన్ కింద ఎంపికై ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్లలో ఆందోళన మొదలైంది. అయితే.. ఆందోళన అవసరం లేదని, అభ్యర్థుల ప్రయోజనాలు కాపాడి తీరతామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో సింగిల్ బెంచ్ తీర్పును ఏపీపీఎస్సీ డివిజన్ బెంచ్ ఎదుట సవాల్ చేసింది. తీర్పుపై స్టే విధించాలని కోరింది. ఈ క్రమంలో.. మాన్యువల్‌గా ఒక్కసారే మూల్యాంకనం చేసిన సీసీ కెమెరా ఫుటేజీలను డివిజన్ బెంచ్‌కు సమర్పించింది ఏపీపీఎస్సీ.
సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్వర్వులపై క్షుణ్ణంగా విచారణ జరిపింది ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్… న్యాయస్థానం బెంచ్ లో సభ్యులైన జస్టిస్ రవినాథ్ తిల్హారి, జస్టిస్ హరినాథ్ ఈ కేసులో ఇరుపక్షాల వాదనలను సమగ్రంగా విన్నారు. అన్ని పరిశీలించిన మీదట సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది డివిజన్ బెంచ్. తదుపరి విచారణ వచ్చేవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో తుది ఆదేశాలు వచ్చేంతవరకు ఉద్యోగులు తమ తమ ఉద్యోగాల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగులకు ఊరట లభించినట్లయ్యింది.
Also Read : BJP Third List: బీజేపీ మూడో జాబితా విడుదల ! చెన్నై సౌత్ నుంచి మాజీ గవర్నర్ తమిళి ‘సై’ !