Kadiyam Srihari: కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కుమార్తె కావ్య !

కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, కుమార్తె కావ్య !

Kadiyam Srihari: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. లోక్ సభ టిక్కెట్టు ఆశపడి భంగపడ్డ నేతలతో పాటు టిక్కెట్టు దక్కిన నేతలు కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సాకుగా చూపి పార్టీను వీడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కడియం శ్రీహరి(Kadiyam Srihari)… బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్‌ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. వారికి దీపాదాస్ మున్షీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు కుమార్తె కావ్యతో కలిసి కడియం శ్రీహారి ఆదివారం ఉదయం సీఎం రేవంత్ నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీలతో కొద్ది సేపు మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

Kadiyam Srihari  Joined in Congress

కాగా తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న తన కూతురిని ఓడిపోయే పార్టీ తరఫున పోటీ చేయించదలచుకోలేదని స్టేషన్‌ ఘన్‌పూర్‌ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) అన్నారు. పార్టీ మారే విషయంపై ఆలోచిస్తున్నది అందుకేనన్నారు. వరంగల్‌ లోక్‌ సభ స్థానం నుంచి పోటీ కోసం కాంగ్రెస్‌ పార్టీ నుంచి పిలుపు వచ్చిందని, ఏఐసీసీ ప్రతినిధులు తన నివాసానికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. అయితే నియోజకవర్గ నేతలు, కార్యకర్తలను అడిగిన తర్వాతే తన నిర్ణయం చెబుతానని వారికి చెప్పానన్నారు. ఆదివారం ఉదయం 11 గంటలకు తన కుమార్తె కావ్యతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. వరంగల్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా కావ్య పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా కడియం శ్రీహరి(Kadiyam Srihari) మాట్లాడుతూ.. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ పార్టీ ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని, నాయకులు అయోమయంలో ఉన్నారని అన్నారు. అరూరి రమేశ్‌ వద్దు అంటేనే కడియం కావ్యకు వరంగల్‌ టికెట్‌ ఇచ్చారని, పార్టీ ఒడిదుడుకుల్లో ఉన్నా.. తాము పోటీ చేయాలనే అనుకున్నామని చెప్పారు. అయితే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో చాలా మంది నాయకులు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరారని, జిల్లాలో పార్టీ బలహీన పడిందని అన్నారు.
పార్టీ పదేళ్లు అధికారంలో ఉన్నా… తన వెంట ఉన్న నాయకులు, కార్యకర్తలు ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే ఉన్నారని కడియం శ్రీహరి అన్నారు. ఇప్పుడేమో అధికారం లేక ప్రతిపక్షంలో ఉన్నామని పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ ఎవరికీ అన్యాయం చేయలేదు కానీ… తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్‌, పసునూరి దయాకర్‌ పార్టీ మారినప్పుడు ఎవరూ మాట్లాడలేదని… ఇప్పుడు మాత్రం అందరూ మాట్లాడుతున్నారని తెలిపారు. కొంత మంది నెలల తరబడి పార్టీలో చేరతామని కాంగ్రెస్‌ వారి ఇళ్ల చుట్టూ తిరిగినా వారు చేర్చుకోలేదని… కానీ… ఆ పార్టీ వాళ్లే తన ఇంటికి వచ్చి పార్టీలో చేరమని అడుగుతున్నారని గుర్తు చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రస్థానంలో తాను ఒక్క తప్పు కూడా చేయలేదని, ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని, రియల్‌ ఎస్టేట్‌, భూ కబ్జాలు చేయలేదని, ప్రైవేటు యూనివర్సిటీలు పెట్టుకోలేదని అన్నారు. తనను విమర్శించే నైతిక అర్హత ఏ ఒక్కరికీ లేదన్నారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో తనపై ఒక్క కేసు కూడా లేదన్నారు. చాలా మంది పార్టీని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా ఆస్తులు కూడబెట్టుకున్నారని తెలిపారు. తనను ఆశీర్వదించినట్లే తన కుమార్తెనూ ఆశీర్వదించాలని నేతలను కడియం శ్రీహరి కోరారు.

Also Read : Mamata Banerjee: కనీసం 200 స్థానాల్లో గెలవండంటూ బీజేపీకు మమతా సవాల్‌ !

Leave A Reply

Your Email Id will not be published!