Swati Maliwal: కేజ్రీవాల్ పై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్‌ సంచలన ఆరోపణలు !

కేజ్రీవాల్ పై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్‌ సంచలన ఆరోపణలు !

కేజ్రీవాల్ పై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్‌ సంచలన ఆరోపణలు !

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ తన చెంపపై ఏడెనిమిసార్లు గట్టిగా కొట్టారంటూ ఆప్‌ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్‌ సంచలన ఆరోపణ చేశారు. కేజ్రీవాల్‌ అధికారిక నివాసంలో సోమవారం జరిగిన ఈ ఘటనలో పీరియడ్స్ నొప్పితో బాధపడుతున్నానని వారిస్తున్నా నిందితుడు తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని తెలిపారు. అయినప్పటికీ తనను కాపాడేందుకు అక్కడున్న ఎవరూ ముందుకు రాలేదని వాపోయారు. ఈ మేరకు ఆమె ఆరోపించినట్లు గురువారం నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

ఎఫ్ఐఆర్ లో వివరాల ప్రకారం… ‘‘నా జీవితంలో నేనెదుర్కొన్న అత్యంత కష్టకాలం. నొప్పి, గాయం, వేధింపులు నా మనసును బాధించాయి. దాడితో నాకు నడవటం కష్టంగా ఉంది. ఈ ఘటనతో నేను తీవ్రంగా కలత చెందాను. కేజ్రీవాల్‌ను కలిసేందుకు సోమవారం ఉదయం 9 గంటలకు ఆయన నివాసానికి చేరుకున్నాను. డ్రాయింగ్‌ రూంలో నేను ఎదురు చూస్తుంటే కుమార్‌ దూసుకొచ్చి, అకారణంగా నాపై అరిచి, నన్ను దుర్భాషలాడారు. నా చెంపపై ఏడెనిమిది సార్లు గట్టిగా కొట్టారు. దీనితో దిగ్భ్రాంతికి లోనై సహాయం కోసం పలుమార్లు అరిచాను. నన్ను రక్షించుకునేందుకు ఆయన్ను కాళ్లతో తోసేశాను. ఆ సమయంలో ఆయన నాపై పడ్డారు. కర్కశంగా లాగారు. కావాలనే నా చొక్కా పట్టుకుని గుంజారు. దాని గుండీలు ఊడిపోయి పైకి వచ్చేసింది. నేను మధ్యలో ఉన్న టేబుల్‌ను ఢీకొట్టి కిందపడిపోయాను.

 

కుమార్‌ తన కాళ్లతో నా ఛాతీ, పొట్ట, సున్నితావయవాలపై కనికరం లేకుండా తన్నారు. తీవ్రమైన నొప్పితో కొట్టొద్దంటూ వేడుకున్నా. రుతుస్రావంలో ఉన్నానంటూ, వదిలేయమని మొత్తుకున్నా. సాయం కోసం అరుస్తూనే ఉన్నా నన్ను కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ‘నువ్వేం చేసుకుంటావో చేసుకో. మమ్మల్నేం చేయలేవు. నీ ఎముకలు విరగ్గొడతాం. ఎవరూ గుర్తించలేని చోట నిన్ను పాతిపెడతాం’ అంటూ కుమార్‌ నన్ను బెదిరించారు. అత్యవసర నంబరు 112కు ఫోన్‌ చేసి సంఘటనను వివరించాను. ఆ సమయంలో బయటకు వెళ్లిన కుమార్‌ ప్రధాన ద్వారం వద్ద ఉన్న భద్రతా సిబ్బందిని తీసుకొచ్చారు. వారు నన్ను బయటకు వెళ్లమన్నారు.

 

తీవ్రంగా దెబ్బలు తిన్నానని, పీసీఆర్‌ వ్యాన్‌ వచ్చే వరకూ ఉండనివ్వాలని వారిని కోరాను. పీసీఆర్‌ సిబ్బంది సాయంతో ఆటో ఎక్కాను. అక్కడ నుంచి నేరుగా సివిల్‌ లైన్స్‌ పోలీసు స్టేషన్‌కు చేరి జరిగిన విషయమంతా ఎస్‌హెచ్‌వోకు వివరించాను. తీవ్రమైన నొప్పి… మీడియా నుంచి వస్తున్న ఫోన్లు.. ఘటనను రాజకీయం చేయకూడదని రాతపూర్వకంగా ఫిర్యాదు చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాను’’ అని మాలీవాల్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఆమె తీస్‌ హజారీ న్యాయస్థానంలో మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇచ్చారు. గూండాల ఒత్తిడితోనే తన ఆరోపణలు నిరాధారమైనవని పార్టీ పేర్కొందని, తన వ్యక్తిత్వాన్ని శంకిస్తున్నారని మాలీవాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన మాలీవాల్ వీడియోలు !

దాడి ఆరోపణల నేపథ్యంలో ఆప్‌ ఎంపీకి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు ఈ పరీక్షలో తేలిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. స్వాతి మాలీవాల్‌పై దాడి నేపథ్యంలో తాజాగా ఆన్‌లైన్‌లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. అది ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంటిలోనిదని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అందులో మాలీవాల్‌… భద్రతా సిబ్బందితో వాదిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిపై తాజాగా ఆమె ఎక్స్‌ వేదికగా స్పందించారు. ‘‘ప్రతిసారిలాగే… ఈసారి కూడా ఈ రాజకీయ హిట్‌మ్యాన్‌ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అసలు విషయం లేకుండా పోస్టులు, వీడియోలను ప్రచారం చేయడం ద్వారా… ఈ నేరం నుంచి తనను తాను రక్షించుకోవచ్చని భావిస్తున్నారు’’ అని స్వాతి పేర్కొన్నారు.

కేజ్రీవాల్‌ క్షమాపణ చెప్పాలి – నిర్మలా సీతారామన్‌

ఆప్‌ ఎంపీ స్వాతీమాలీవాల్‌పై దాడి ఘటనపై… ఆ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ మౌనం వహించడం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ అన్నారు. మహిళా కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన ఆమెకు ఈ పరిస్థితి ఎదురుకావడం సిగ్గుచేటన్నారు. ‘‘తన నివాసంలోనే పార్టీ ఎంపీపై దాడి జరిగితే… కేజ్రీవాల్‌ ఒక్క మాట మాట్లాడకపోవడం షాక్‌కు గురిచేస్తోంది. తగిన చర్యలు తీసుకోలేదు. దీనిపై ఆయన క్షమాపణలు చెప్పాలి. యూపీ పర్యటనలో ఆయన వెంట నిందితుడు ఉన్నాడని నాకు తెలిసింది. ఆమెకు ఎదురైన పరిస్థితి సిగ్గుచేటు. ఫిర్యాదు చేయడానికి రోజుల సమయం పట్టిందంటే… ఆమెపై ఒత్తిడి ఉందని అనిపిస్తోంది’’ అని సీతారామన్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఆప్‌లో ఇలాంటి దాడులు సాధారణమే – షాజియా ఇల్మి

స్వాతి మాలీవాల్‌పై దాడి నేపథ్యంలో ఆప్‌ మాజీ నాయకురాలు షాజియా ఇల్మి సంచలన ఆరోపణలు చేశారు. గతంలో తనకూ ఇలాంటి అనుభవాలు ఎదురైనట్లు చెప్పారు. ఆ పార్టీలో కొట్టడం సర్వసాధారణమని అన్నారు. ‘‘స్వాతిపై దాడి జరిగింది. కేజ్రీవాల్‌ చెప్పింది చేయడమే బిభవ్‌ పని. ఆ వ్యక్తి దురుసు ప్రవర్తనను నేనూ సహించాల్సి వచ్చింది. అక్కడ కొట్టడం మామూలే. ప్రశాంత్‌ కుమార్, యోగేంద్ర యాదవ్‌ లాంటి వాళ్లను బౌన్సర్లలతో గెంటేశారు. ఈసారి హద్దులు దాటారు. పీఏతో ఓ మహిళను కొట్టించడం తగినదేనా? ఇంత జరిగాక కేజ్రీవాల్‌ సీఎం పదవిలో కొనసాగడం సరికాదు. ఘటనకు బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పి పదవికి రాజీనామా చేయాలి’’ అని ఆమె డిమాండ్‌ చేశారు.

ఎన్‌సీడబ్ల్యూ ముందు హాజరుకాని బిభవ్‌ కుమార్‌ !

కేజ్రీవాల్‌ వ్యక్తిగత సహాయకుడు, ఆప్‌ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బిభవ్‌ కుమార్‌ శుక్రవారం జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) విచారణకు గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనకు నోటీసులిచ్చేందుకు ఎన్‌సీడబ్ల్యూ బృందం పోలీసులతో కలిసి శుక్రవారం కుమార్‌ ఇంటికి వెళ్లినట్లు కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖా శర్మ వెల్లడించారు. అయితే ఆ ఇంట్లోని వ్యక్తులు నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారని… దీనితో ఆ ఇంటి ద్వారానికి నోటీసులు అతికించారని చెప్పారు. విచారణను శనివారం చేపడతామని ఆమె వివరించారు.

 

మాలీవాల్‌పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు ఘటన చోటుచేసుకున్న కేజ్రీవాల్‌ నివాసానికి శుక్రవారం సాయంత్రం 4.45 గంటలకు వెళ్లారు. వారితో పాటు ఫోరెన్సిక్‌ సిబ్బంది కూడా ఉన్నారు. దాడి ఘటనను పునఃసృష్టి చేసేందుకు స్వాతి మాలీవాల్‌ను కూడా తమ వెంట తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఇంట్లో ఉన్న ఎనిమిది సీసీటీవీ ఫుటేజీని సేకరించారు. భద్రతా సిబ్బంది వాంగ్మూలాలను రికార్డు చేసుకున్నారు. మరో పోలీసు బృందం నిందితుడు బిభవ్‌ కుమార్‌ను విచారించేందుకు ఆయన ఇంటికి కూడా వెళ్లిందని ఓ అధికారి తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!