CM Chandrababu Naidu: గన్నవరం వేదికగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు !
గన్నవరం వేదికగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు !
గన్నవరం వేదికగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు !
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా విజయోత్సవ సభ కూడా నిర్వహించనున్నారు. ప్రధాని మోదీతోపాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కూటమి నేతలు హాజరు కానున్నారు. సభ నిర్వహణ కోసం గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్, మంగళగిరి ఎయిమ్స్ సమీపంలో బ్రహ్మానందపురం ఏసీసీ భూములను అధికారులు, టీడీపీ నేతలు పరిశీలించారు. ఐటీ పార్క్ వద్ద స్థలాలు అనుకూలంగా ఉన్నాయని, అక్కడైతే 1.5 లక్షల వరకు ప్రజలు వీక్షించేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేశారు.
ప్రమాణ స్వీకార ఏర్పాట్లలో భాగంగా.. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని బ్రహ్మానందపురం ఏసీసీ భూములను అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. అధికారులు రూపొందించిన రేఖా చిత్రాన్ని చూశారు. రహదారి మార్గాలపై వివరాలు తెలుసుకున్నారు. ‘హెలిప్యాడ్లు వేదికకు సమీపంలో ఉండాలి. సభా వేదిక, గ్యాలరీలు ఏర్పాటు చేయాలి. కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేస్తాం’ అని అచ్చెన్నాయుడు చెప్పారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం ఎదురుగా ఉన్న స్థలాన్ని పరిశీలించారు. అక్కడైతే ప్రముఖుల రాకపోకలకు ఇబ్బంది ఉండదని, ఏర్పాట్లు చేయొచ్చని అధికారులు వివరించారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణస్వీకార కార్యక్రమం ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. సభావేదిక నిర్మాణం కోసం ఇప్పటికే 12 లారీలలో సామగ్రిని తీసుకొచ్చారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టి.డి.జనార్దన్ తదితరులు సభా స్థలాన్ని పరిశీలించారు.
ఈ ప్రమాణ స్వీకారానికి దేశం నలుమూల నుండి పలువురు ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో 12 హెలిప్యాడ్లు, గ్యాలరీలు, రవాణా ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంటుంది. ప్రధాని మోదీ సహా వివిధ రాష్ట్రాల నేతలు హాజరు కానున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ శుక్రవారం సాయంత్రం సమీక్షించారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితోపాటు కృష్ణా జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులతో చర్చించారు. ‘ప్రధాని మోదీ హాజరవుతున్న నేపథ్యంలో.. భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీజీపీతో చర్చించాం. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. ప్రొటోకాల్ పరంగా వారికి కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక బృందాలను ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతి విశిష్ఠ అతిథికి ఒక్కో బృందం ప్రొటోకాల్ ఏర్పాట్లు చూస్తుంది’ అని నీరభ్ కుమార్ ప్రసాద్ చెప్పారు. ‘గన్నవరం, మంగళగిరి ప్రాంతాల్లో స్థలాలు పరిశీలించాం. కాబోయే ముఖ్యమంత్రి నుంచి నిర్ణయం రాగానే… యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది’ అని తెలిపారు.