JP Nadda: రాజ్యసభాపక్ష నేతగా జేపీ నడ్డా !
రాజ్యసభాపక్ష నేతగా జేపీ నడ్డా !
JP Nadda: కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) రాజ్యసభా పక్షనేతగా బాధ్యతలు చేపట్టనున్నారు. పెద్దల సభలో ఇప్పటివరకు పీయూష్ గోయల్ సభాపక్ష నేతగా ఉండగా… ఇప్పుడు ఆయన స్థానంలో నడ్డాను ఎంపిక చేశారు. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన వెలువడింది. ప్రస్తుతం జేపీ నడ్డా కేంద్రంలో ఆయన వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల శాఖ మంత్రిగా ఉన్నారు.
JP Nadda….
ఈ ఏడాది ఫిబ్రవరిలో జేపీ నడ్డా వరుసగా మూడోసారి రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. గతంలో సొంత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్ నుంచి పెద్దల సభకు ఎన్నికైన ఆయన… ఈ సారి గుజరాత్ నుంచి ఎగువసభకు వెళ్లారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి రావడంతో నడ్డాను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
ఇక, పార్టీ అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం ఈ నెలతో ముగియనుంది. అయితే, ఈ ఏడాది చివర్లో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యే వరకూ పదవిలో కొనసాగాలని అధిష్ఠానం నడ్డాను కోరినట్లు సమాచారం. అన్ని రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు 50 శాతం పూర్తయిన తర్వాతే కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని పార్టీ నిబంధనలు చెబుతున్నాయి. డిసెంబరు-జనవరిలో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా… కేంద్ర హోం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన నడ్డా… జనవరి 2020లో పూర్తిస్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
Also Read : Atishi Marlena: నాలుగో రోజు కొనసాగుతోన్న ఢిల్లీ మంత్రి ఆతిశీ దీక్ష ! క్షీణిస్తోన్న ఆరోగ్యం !