Kedarnath Landslides: కేదార్ నాథ్ నడక మార్గంలో విరిగిపడ్డ కొండ చరియలు ! ముగ్గురు మృతి !
కేదార్ నాథ్ నడక మార్గంలో విరిగిపడ్డ కొండ చరియలు ! ముగ్గురు మృతి !
Kedarnath Landslides: భూతల కైలాసం ఉత్తరాఖండ్ లోని గౌరీకుండ్-కేదార్నాథ్(Kedarnath) భక్తుల నడక మార్గంలో ఆదివారం ఉదయం పెను ప్రమాదం చోటుచేసుకుంది. కేదార్ నాథ్ ప్రాంతంలోని చిర్బాస సమీపంలో కొండపై నుంచి అకస్మాత్తుగా భారీ మొత్తంలో శిథిలాలు, బండరాళ్లు పడిపోయాయి. దీనితో అదే సమయంలో యాత్రకు వెళ్తున్న వారిలో ముగ్గురు మరణించగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ఉదయం 7:30 గంటల సమయంలో సమాచారం అందిందని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ తెలిపారు. ఈ సమాచారం అందిన వెంటనే భద్రతా సిబ్బంది ఎన్డిఆర్ఎఫ్, డీడీఆర్ఎఫ్, వైఎంఎఫ్, పరిపాలన బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపడుతున్నారు.
Kedarnath Landslides…
మృతుల్లో ఒకరు రుద్రప్రయాగ్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్(Uttarakhand) ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేసారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అంతేకాదు మృత దేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించి… సంబంధిత బంధువులకు అప్పగించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేసారు.
మరోవైపు ఉత్తరాఖండ్(Uttarakhand)లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనితో పలుచోట్లు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కొండచరియలు విరిగిపడుతూ జనాలను భయకంపితులను చేస్తున్నాయి. తాజాగా ఉత్తరకాశీలోని గంగోత్రి జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రహదారిని మూసివేశారు. దీనితో ఉత్తరకాశీలోని మనేరి, భట్వాడిల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బార్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) బృందం ఈ హైవేపై పడిన రాళ్లు, శిధిలాలను తొలగించేపని చేపట్టింది. వీలైనంత త్వరగా రహదారిని క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని అల్మోరా, బాగేశ్వర్, చమోలీ, చంపావత్, గర్వాల్, హరిద్వార్, నైనిటాల్, పిథోరాఘర్, రుద్రప్రయాగ్, తెహ్రీ గర్వాల్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాల్లో ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఉత్తరాఖండ్‌లోని పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున కేదార్నాథ్(Kedarnath)లోని గౌరీకుండ్ సమీపంలో రాళ్లు పడడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. దీనికిముందు జూలై ప్రారంభంలో బద్రీనాథ్ మార్గంలో కొండచరియలు విరిగిపడిన ఉదంతాలు చోటుచేసుకున్నాయి. దీంతో అప్పట్లో బద్రీనాథ్ మార్గాన్ని కూడా మూసివేశారు. అయితే బీఆర్ఓ బృందం శిధిలాలు, రాళ్లను తొలగించడంతో ఆ రహదారిని తిరిగి తెరిచారు.
Also Read : KTR: రాజ్యాంగ ఉల్లంఘనపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం – మాజీ మంత్రి కేటీఆర్