Nara Lokesh: కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై మంత్రి నారా లోకేశ్ స్పందన !
కేంద్ర బడ్జెట్లో ఏపీకి కేటాయింపులపై మంత్రి నారా లోకేశ్ స్పందన !
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు కేటాయింపుతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామంటూ బడ్జెట్ 2024-25 ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందిస్తామంటూ సీతారామన్ ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) స్పందించారు.
‘‘ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి, జీవనాడి పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు’’ అని ఆయన తెలిపారు. బడ్జెట్లో రూ.15 వేల కోట్లు కేటాయించి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కట్టుబడిన ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
Nara Lokesh Comment
కాగా రాష్ట్ర విభజన తర్వాత గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను గట్టెక్కించేలా 2024-25 బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకు ప్రత్యేక సాయం చేయనున్నట్లు ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని భరోసా కల్పించారు. రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక సహకారం అందించనున్నామని, 2024-25 బడ్జెట్లో ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించారు.
ఇక రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రత్యేక రాయితీలు కల్పిస్తామని ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రకటన చేశారు. విశాఖ-చెన్నై ఇండస్ట్రీయల్ కారిడర్ అభివృద్ధికి నిధులు కేటాయించామని తెలిపారు. ఇక విభజన చట్టంలో పేర్కొన్న వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తామని, రాయలసీమ, ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రకు నిధులు కేటాయిస్తామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Also Read : CM Revanth Reddy : అసెంబ్లీ సమావేశంలో సాయన్న ను గుర్తు చేసుకొని భావోద్వేగంతో మాట్లాడిన సీఎం