Praveen Prakash IAS: స్వచ్ఛంద పదవీ విరమణ పై వెనక్కి తగ్గిన ప్రవీణ్‌ ప్రకాశ్‌ !

స్వచ్ఛంద పదవీ విరమణ పై వెనక్కి తగ్గిన ప్రవీణ్‌ ప్రకాశ్‌ !

Praveen Prakash: స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వివాదాస్పద సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ప్రవీణ్‌ ప్రకాశ్‌ వెనక్కితగ్గినట్లు తెలుస్తోంది. ఆయన మళ్లీ సర్వీసులో చేరేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. తనను మళ్లీ సర్వీసులోకి తీసుకోవాలని కోరుతూ ఆయన ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు. తాను స్వచ్ఛంద పదవీ విరమణ చేయాలని తొందరపాటున నిర్ణయం తీసుకున్నానని, అప్పట్లో మానసికంగా ఒత్తిడిలో ఉన్నానని ఆ ధరఖాస్తులో పేర్కొన్నారు. ప్రభుత్వంలోని ముఖ్యుల్ని కలసి విజ్ఞప్తి చేసేందుకు అపాయింట్‌మెంట్‌ అడిగారు. అయితే ఆయన్ను కలిసేందుకు వారు ఇష్టపడలేదని సమాచారం. అంతేకాదు ప్రవీణ్ ప్రకాశ్(Praveen Prakash) విజ్ఞప్తినీ పరిగణనలోకి తీసుకోరాదని నిర్ణయించారు. ఇక ప్రవీణ్‌ ప్రకాశ్‌కు వీఆర్‌ఎస్‌ తీసుకుని వెళ్లడం తప్ప మరో మార్గం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.

వైసీపీ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగిన ప్రవీణ్‌ ప్రకాశ్‌ తీవ్ర వివాదాస్పద అధికారిగా పేరు పొందడంతో రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడగానే ఆయన్ను పక్కన పెట్టింది. బదిలీ చేసి, పోస్టింగ్‌ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్‌ చేయమని ఆదేశించింది. ఎన్డీయే ప్రభుత్వంలో తనకు సరైన పోస్టింగ్‌ దక్కదని భావించిన ఆయన.. ఇంకా ఏడేళ్ల సర్వీసు ఉండగానే జూన్‌ 25న స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. దానికి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ జులై మొదటి వారంలో జీఓ జారీ చేశారు. ఆయన వీఆర్‌ఎస్‌ సెప్టెంబరు 30 నుంచి అమల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Praveen Prakash – అత్యంత వివాదాస్పద అధికారిగా ప్రవీణ్ ప్రకాశ్

వైసీపీ అధికారంలోకి వచ్చాక స్వల్ప వ్యవధిలోనే ముఖ్యమంత్రి జగన్ కోటరీలో ముఖ్యుడిగా మారిపోయిన ప్రవీణ్‌ ప్రకాశ్‌(Praveen Prakash) అత్యంత వివాదాస్పద అధికారిగా పేరుపడ్డారు. సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా, సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్య కార్యదర్శిగా ఏకకాలంలో రెండు పోస్టులు నిర్వహిస్తూ చక్రం తిప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా లెక్కచేయనంతగా ఆయన హవా సాగింది. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులకు పోస్టింగ్‌ లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడంలో, కేసులు పెట్టించడంలోనూ ప్రవీణ్‌ ప్రకాశ్‌ పాత్రే కీలకమన్న ఆరోపణలున్నాయి. విశాఖలో రూ. 450 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసి జగన్‌ కట్టించుకున్న విలాసవంతమైన భవనాలకు రుషికొండను ఎంపిక చేయడంలోనూ ఆయన పాత్ర ఉందని చెబుతారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు, చిక్కీలు, కోడిగుడ్ల సరఫరా టెండర్ల పొడిగింపు వంటి అవకతవకల్లో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణకు ఆయన పూర్తిగా సహకరించినట్లు ఆరోపణలున్నాయి.

Also Read : GHMC Commissioner : భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండి పర్యటించాలి

Leave A Reply

Your Email Id will not be published!