CM Nara Chandrababu Naidu: వరద ప్రభావిత ప్రాంతాలల్లో సీఎం చంద్రబాబు పర్యటన !

వరద ప్రభావిత ప్రాంతాలల్లో సీఎం చంద్రబాబు పర్యటన !

CM Nara Chandrababu: గడచిన 48 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విజయవాడ నగరం జలదిగ్భందంలో చిక్కుకుంది. దాదాపు 200 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా విజయవాడ ప్రాంతంలో వరదలు పోటెత్తాయి. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడటమే కాకుండా, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ వరద ప్రభావంతో ఇప్పటివరకు సుమారు 10 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. బోటులో వెళ్లి సింగ్‌నగర్, తదితర వరద ప్రాంతాలను చంద్రబాబు(CM Nara Chandrababu) పరిశీలించారు. భద్రతా సిబ్బంది వద్దంటున్నా వినకుండా సీఎం బోటులో వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సింగ్‌ నగర్‌ గండి పూడ్చడంపై అధికారులతో మాట్లాడారు. బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

CM Nara Chandrababu Naidu Comment

‘‘బాధితుల ఇబ్బందులను దగ్గరుండి చూశా. వరదనీరు తగ్గే వరకు పరిస్థితి పర్యవేక్షిస్తా. బాధితులకు వెంటనే ఆహారం, తాగునీరు అందిస్తాం. ఆరోగ్యం బాగాలేని వారిని ఆసుపత్రులకు తరలిస్తాం. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు మీ దగ్గర్లోనే ఉంటా’’ అని బాధితులకు భరోసా కల్పించారు.

వరద పరిస్థితుల నేపథ్యంలో విపత్తు నిర్వహణ కార్యాలయంలో అధికారులతో సీఎం చంద్రబాబు(CM Nara Chandrababu) సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాజా టోల్‌గేట్‌, జగ్గయ్యపేటలో ముంపు ఎక్కువగా ఉందన్నారు. విజయవాడ, గుంటూరులో 37 సెంటీమీటర్ల వర్షం కురవడం అసాధారణమని, అందుకే ముంపు ప్రాంతాల సంఖ్య పెరిగిందని చెప్పారు. గుంటూరు, విజయవాడలో సహాయక చర్యలు చేపట్టామన్నారు.

‘‘అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాం. వర్షాలు, వరదల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకరు గల్లంతయ్యారు. కొండచరియలు పడటం, కారులో చనిపోవడం, వాగులో కారు కొట్టుకుపోయి ముగ్గురు చనిపోవడం బాధాకరం. పులిచింతల నుంచి ప్రవాహం ఎక్కువగా వస్తోంది. ప్రకాశం బ్యారేజీకి 8.8 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. బుడమేరు వల్ల వీటీపీఎస్‌లో విద్యుదుత్పత్తి ఆగింది. ప్రకాశం బ్యారేజీ కింద పలు చోట్ల గట్లు బలహీనంగా ఉన్నాయి. గట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలు వేస్తున్నాం.

వర్షాల వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 107 క్యాంపులు పెట్టాం.. 17 వేల మందిని తరలించాం. ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. వరదముంపు ప్రాంతాలకు బోట్లు పంపించాం. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఎక్కడిక్కడ ఏర్పాట్లు చేశాం. భవిష్యత్‌లో ఇలాంటి విపత్తులు రాకుండా చర్యలు చేపడతాం. ప్రజల ప్రాణాలు కాపాడటమే మా తక్షణ కర్తవ్యం. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా సత్వర చర్యలు చేపడుతున్నాం. వరద ప్రాంతాల్లో బియ్యం, పప్పు, నూనె, పంచదార, కూరగాయలు పంపిణీ చేస్తున్నాం. మత్స్యకారుల కుటుంబానికి 50 కిలోల బియ్యం ఇస్తున్నాం. సాధారణ పరిస్థితులు నెలకొనేవరకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నాం. నష్టపోయిన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తాం. పంటలు నష్టపోయిన వారికి పరిహారం అందిస్తాం.

Also Read : Nara Lokesh : గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై కీలక అంశాలను వెల్లడించిన మంత్రి లోకేశ్

Leave A Reply

Your Email Id will not be published!