TTD: శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఇకపై ఎలాంటి అనుమానాలు వద్దు టీటీడీ ఈవో

శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఇకపై ఎలాంటి అనుమానాలు వద్దు టీటీడీ ఈవో

TTD: తిరుమలలో కలకలం రేపిన కల్తీ నెయ్యి దోషాన్ని గత నెల ఆగస్టులో సంప్రోక్షణతో పోగొట్టామని, భక్తులు ఎవరూ ఆందోళన చెందవద్దని టీటీడీ(TTD) కార్యనిర్వహణాధికారి శ్యామలరావు వెల్లడించారు. శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం చేసినట్లు టీటీడీ(TTD) ఈవో శ్యామలరావు తెలిపారు. సోమవారం ఆలయంలో శాంతి హోమం, పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమాల అనంతరం ఈవో, ఆలయ అర్చకులు మీడియాతో మాట్లాడారు. ఆలయంలోని అన్ని విభాగాల్లో ప్రోక్షణ కార్యక్రమాలు చేసినట్లు ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు. స్వామి వారికి మహా నైవేద్యం పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రసాదాల తయారీ కేంద్రాల్లో కూడా సంప్రోక్షణ చేస్తున్నామన్నారు. దోషం కలిగిందన్న భావన లేకుండా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. చివరిగా పూర్ణాహుతి కార్యక్రమంతో అన్ని దోషాలు తొలగుతాయని తెలిపారు. భక్తులెవరూ ఆందోళన చెందవద్దన్నారు.

‘‘ఇటీవల జరిగిన దోషాలు తొలగిపోవాలని శాంతి హోమం చేశాం. పవిత్రోత్సవాలకు ముందే నెయ్యి మార్చేశాం. లడ్డూ ప్రసాదం విషయంలో ఇకపై ఎలాంటి అనుమానాలొద్దు. పవిత్రోత్సవాల ముందు జరిగిన దోషం.. పవిత్రోత్సవాలతో పోయింది. మార్చిన నెయ్యితోనే ఆ తర్వాత ప్రసాదాలు తయారుచేశాం. తెలిసీ తెలియక జరిగిన దోషాలు శాంతిహోమం, ప్రోక్షణతో తొలగుతాయి’’ అని వేణుగోపాల దీక్షితులు అన్నారు.

TTD – తిరుమలలో ముగిసిన మహా శాంతి యాగం

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కారణంగా శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం చేపట్టిన మహాశాంతి యాగం ముగిసింది. పూర్ణాహుతితో శాస్త్రోక్తంగా హోమం పూర్తి అయ్యింది. సోమవారం రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతి హోమం నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు హోమం నిర్వహించారు. ముందుగా మహాశాంతి యాగం, వాస్తూ హోమం నిర్వహణ జరిగింది. కాగా శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్క రోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారు. ప్రస్తుతం మహా శాంతియాగం ముగియగా… మరికాసేపట్లో పంచగవ్యాలతో శ్రీవారి ఆలయంతో పాటు వకుళ మాత పోటు, లడ్డు పోటు, బూందీ పోటు, ప్రసాద విక్రయశాలల్లో అర్చకులు సంప్రోక్షణ చేయనున్నారు.

Also Read : Supreme Court: తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైవీ సుబ్బారెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!