Narendra Modi : కాంగ్రెస్ ఎప్పటికి వెనుకబడిన తరగతులను ముందుకు రానీయదు
అందరూ ఒకటిగా కలిసుంటేనే క్షేమంగా ఉంటామని మరోసారి మోదీ తన నినాదాన్ని వినిపించారు...
Narendra Modi : కాంగ్రెస్ పార్టీ ఏరోజూ వెనుకబడిన తరగతులను పట్టించుకున్న పాపాన పోలేదని, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దళితులు, వెనుకబడిన తరగతుల వారు ఎదగడానికి దోహదపడలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) అన్నారు. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా చిముర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ, ఇండియాను పరిపాలించడానికి తాము పుట్టినట్టు ఆ రాజకుటుంబం అనుకుంటుందని కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఆ కారణంగానే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దళితులు, వెనుకబడిన తరగుతులు, ఆదివాసీలు ఎదగకుండా చేసిందని అన్నారు.
Narendra Modi Slams..
రాజీవ్ గాంధీ నాయకత్వంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఒక అడ్వర్‌టైజ్‌మెంట్‌ను మోదీ(Narendra Modi) ప్రస్తావిస్తూ, అది ఆ పార్టీ రిజర్వేషన్ వ్యతిరేక వైఖరిని ప్రతిబింబిస్తుందని చెప్పారు. దళితులు, వెనుకబడిన తరగతులు, ఆదివాసీలకు ప్రత్యేక హక్కులను ప్రశ్నించేలా ఆ ప్రకటన ఉందని చెప్పారు. కశ్మీర్‌లో 370వ అధికరణను రద్దు చేయడంపై మాట్లాడుతూ, యావద్దేశానికి ఒకే రాజ్యాంగం అమలు కావడానికి ఏడు దశాబ్దాలు పట్టిందన్నారు. కశ్మీర్‌లో 370వ అధికరణను పునరుద్ధరించడానికి మీరు అంగీకరిస్తారా అని సభికులను ఉద్దేశించి ప్రధాని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో మహారాష్ట్ర అభివృద్ధికి భరోసా ఇస్తుందన్నారు. మహారాష్ట్రలోని మహాయుతి కూటమి, కేంద్రంలోని బీజేపీ-ఎన్డీయే కూటమితో కలిసి రెట్టింపు స్పీడుతో మహారాష్ట్రను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తుందని హామీ ఇచ్చారు. గత 2.5 ఏళ్లలో డబుల్ స్పీడ్ డవలప్‌మెంట్‌ను ప్రజలు చూసారని, గరిష్ట పెట్టుబడులు మహారాష్ట్ర వచ్చాయని చెప్పారు. కొత్త విమానాశ్రయాలు, ఎక్స్‌ప్రెస్‌వేలు వచ్చాయని, డజను వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని, 100 రైళ్లే స్టేషన్లను ఆధునీకరించామని తెలిపారు.
అందరూ ఒకటిగా కలిసుంటేనే క్షేమంగా ఉంటామని మరోసారి మోదీ తన నినాదాన్ని వినిపించారు. దేశంలో గిరిజన జనాభా సుమారు 10 శాతం ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కమ్యూనిటీని కులాల పేరుతో విడగొట్టి బలహీనపరచాలని అనుకుంటోందని చెప్పారు. అంతర్గత పోరుతో గిరిజనుల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం ఆ పార్టీ చేస్తోందన్నారు. అదే జరిగితే గిరిజనుల ఐక్యత దెబ్బతింటుందని అన్నారు. కాంగ్రెస్ ప్రిన్స్ (రాహుల్) ఇదే విషయాన్ని విదేశంలో ప్రకటించారని, కాంగ్రెస్ కుట్రలో మనం భాగం కారాదని, కలిసికట్టుగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. కాగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో నవంబర్ 20న జరుగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.
Also Read : Vikarabad Collector Attack : వికారాబాద్ కలెక్టర్ పై దాడి ఘటనపై ఏడిజి కీలక ఉత్తర్వులు