MP Raghunandan Rao : కాంగ్రెస్ అంబేద్కర్ వారసులమని చెప్పే ప్రయత్నం చేస్తుంది

ఒక చేతిలో రాజ్యాంగం పట్టుకుని, పక్కన దౌర్జన్యం చేసే వాళ్లను పెట్టుకొని....

Raghunandan Rao : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. రాహుల్ వ్యవహార శైలిపై స్పీకర్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. అంబేద్కర్ పేరిట కాంగ్రెస్ చేసిన నీచ రాజకీయాల నిరసిస్తూ ఎన్డీఏ ఎంపీలు శాంతియుతంగా, పార్లమెంట్‌లో నిరసన తెలిపారని గుర్తుచేశారు. ఇవాళ(గురువారం) పార్లమెంట్ వేదికగా రఘునందన్‌రావు(Raghunandan Rao) మీడియా పాయింట్‌లో మాట్లాడారు.

MP Raghunandan Rao Comments

ఒక చేతిలో రాజ్యాంగం పట్టుకుని, పక్కన దౌర్జన్యం చేసే వాళ్లను పెట్టుకొని.. సీనియర్లను, మహిళలను కూడా గౌరవించకుండా రాహుల్ గాంధీ వ్యవహరించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, ఎంపీ సారంగి గాయాలకు కారణమైన రాహుల్ గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అంబేద్కర్‌కు వారసులమని చెప్పే ప్రయత్నం చేస్తుందన్నారు.రెండుసార్లు అంబేద్కర్‌ని ఓడించిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తుచేశారు. ప్రత్యక్ష ఎన్నికల్లో అంబేద్కర్‌నీ ఓడించడమే కాకుండా, తమ కుటుంబానికి కాంగ్రెస్ భారతరత్న ఇచ్చుకుందని మండిపడ్డారు. ఈ దేశ రాజ్యాంగ నిర్మాతకు అంబేద్కర్‌కు మాత్రం ఎందుకు భారతరత్న ఇవ్వలేదని ప్రశ్నించారు. ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు బీఆర్ అంబేద్కర్ వారసులమని చెప్పుకుంటున్నారని ధ్వజమెత్తారు. అంబేద్కర్ నడయాడిన ప్రాంతాలను పంచ తీర్ధ్‌గా బీజేపీ సర్కార్ అభివృద్ధి చేసిందని తెలిపారు. పార్లమెంట్‌లో జరిగిన దాడికి తాను ప్రత్యక్ష సాక్షిని అని ఎంపీ రఘునందన్‌రావు(Raghunandan Rao) పేర్కొన్నారు.

ప్రతిదానికీ అంబేడ్కర్‌ పేరు ప్రస్తావించడం కాంగ్రెస్‌కు ఫ్యాషన్‌గా మారిందని.. ఆయన పేరు కాకుండా దేవుడిని స్మరించుకుంటే ఏడు జన్మలు స్వర్గం లభిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్రమోదీ గట్టిగా సమర్థించారు. అంబేడ్కర్‌ చరిత్రను తుడిచిపెట్టేందుకు ఆ పార్టీ పన్నని కుట్ర లేదని విమర్శించారు. బాబాసాహెబ్‌ను అవమానించిన ఆ పార్టీ చరిత్రను, వాస్తవాల చిట్టాను షా రాజ్యసభలో బయటపెట్టారని.. అది చూసి కాంగ్రెస్‌ నేతలు బిత్తరపోయారని అన్నారు. అందుకే అంబేడ్కర్‌ను ఆయన అవమానించారని, కేబినెట్‌ నుంచి బహిష్కరించాలంటూ కొత్త నాటకాలు మొదలుపెట్టారని మండిపడ్డారు. ‘వారి దురదృష్టం ఏమిటంటే.. ప్రజలకు నిజం తెలుసు’ అని ప్రధాని బుధవారం ‘ఎక్స్‌’లో వరుస ట్వీట్లు చేశారు. అటు కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అశ్వినీ వైష్ణవ్‌, కిరెన్‌ రిజిజు కూడా షాకు అండగా నిలిచారు. తాను అంబేడ్కర్‌కు వ్యతిరేకంగా ఒక్కనాటికీ మాట్లాడనని షా తేల్చిచెప్పారు.

Also Read : Arvind Kejriwal :సీఎంలు చంద్రబాబు, నితీష్ లకు ప్రశ్నలు సంధించిన కేజ్రీవాల్

Leave A Reply

Your Email Id will not be published!