Konidela Nagababu: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు చేసిన పవన్ కళ్యాణ్
ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు చేసిన పవన్ కళ్యాణ్
Konidela Nagababu : ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయడంతో కూటమి పార్టీ నేతల అభ్యర్ధుల ఖారారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల కాగా… అసెంబ్లీలో సంఖ్యాబలం బట్టి ఐదు స్థానాలు కూడా కూటమి పార్టీలు గెలుపొందే అవకాశం స్పష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ నుండి కొణిదెల నాగబాబును(Konidela Nagababu) ఎమ్మెల్సీ అభ్యర్ధిగా జనసేన(Janasena) అధినేత, ఉప ముఖ్యమంత్రి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నాగబాబు నామినేషన్ కు అవసరమైన పత్రాలను సిద్ధం చేయమని పార్టీ వర్గాలను ఆదేశించారు. అదే సమయంలో నామినేషన్ వేయడానికి సిద్ధంగా ఉండాలని నాగబాబుకు సమాచారం ఇచ్చారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Konidela Nagababu Nominated as a MLC
ఇటీవల ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు టీడీపీ, ఒకటి బీజేపీ తీసుకున్నాయి. ఆ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక సమయంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కోరిక మేరకు తొలుత ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం ఆయన కోసం కేటాయించారు. తీరా శాసనమండలి ఎన్నికల షెడ్యూలు వెలువడిన తరువాత నాగబాబుకు కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగానే నాగబాబు పేరును ఖరారు చేశారు.
దీనితో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ఐదు స్థానాల్లో ఒకరి అభ్యర్థి పేరు ఖరారైంది. ఇప్పటికే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నుకుంటారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఈ భేటీ జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు ఎంపికపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. విజయసాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో నాగబాబును పంపించాలని అనుకునున్నప్పటికీ ఆ స్థానాన్ని ఖాళీ చేయించింది బీజేపీ కాబట్టి… ఆ స్థానాన్ని కమలం పార్టీకి వదలాలి అనే సూచనలు కూడా వచ్చాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం ఉదయం సీఎం చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్… ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా నాగబాబు పేరును ఖరారు చేసినట్లు జనసేన పొలిటికల్ సెక్రటరీ, ఎమ్మెల్సీ హరిప్రసాద్ అధికారికంగా జనసేన గ్రూప్‌లో పోస్ట్ చేశారు. ఈనెల పదవ తేదీలోపు నామినేషన్ వేయాల్సిన నేపథ్యంలో మంచి రోజు చూసుకుని నాగబాబు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అలాగే మిగిలిన నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించగా.. ఐదుగురు కలిసి నామినేషన్ వేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.
Also Read : Chandrababu Naidu: హస్తినకు చంద్రబాబు! అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తో భేటీ !