MDR Fee: యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్‌ రుసుములను విధింపుకు ప్రభుత్వం ప్రతిపాదన ?

యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్‌ రుసుములను విధింపుకు ప్రభుత్వం ప్రతిపాదన ?

MDR Fee : వార్షిక టర్నోవర్‌ రూ.40 లక్షలకు మించిన పెద్ద వ్యాపార సంస్థలకు యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌), రూపే డెబిట్‌ కార్డు లావాదేవీలపై మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (ఎండీఆర్‌) రుసుములను తిరిగి విధించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే రూ.40 లక్షల కంటే తక్కువ టర్నోవర్‌ ఉన్న వ్యాపారులకు మాత్రం యూపీఐ ఛార్జీలు ఉండవని చెబుతున్నారు. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించే లక్ష్యంతో… యూపీఐ(UPI), రూపే కార్డులపై ఎండీఆర్‌ రుసుములను 2022 బడ్జెట్‌లో ప్రభుత్వం తొలగించింది. ఈ రుసుము భారాన్ని బ్యాంకులు/ప్రాసెసింగ్‌ సంస్థలకు ప్రభుత్వం చెల్లించేది. అయితే ఇందుకోసం కేటాయిస్తున్న మొత్తాన్ని రూ.3,500 కోట్ల నుంచి 2025-26 బడ్జెట్లో రూ.437 కోట్లకే పరిమితం చేసింది. అందువల్లే వ్యాపార సంస్థల వద్దే ఆ రుసుము వసూలు చేయాలన్న ప్రతిపాదన మళ్లీ వచ్చింది. ప్రస్తుతం నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ద్వారా జరిగే యూపీఐ (గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం, అమెజాన్‌పే) లావాదేవీలు, రూపే కార్డు లావాదేవీలపై ఎలాంటి ఎండీఆర్‌ ఛార్జీలు(MDR Fee) లేనందున విరివిగా వినియోగిస్తున్నారు.

MDR Fee on UPI Transactions

ప్రస్తుతం యూపీఐ, రూపే కార్డు లావాదేవీల ప్రాసెసింగ్‌ పై బ్యాంకులకు మర్చంట్లు ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, చిన్న వ్యాపారులకు మర్చంట్‌ చార్జీల మినహాయింపును కొనసాగించినప్పటికీ, వార్షిక జీఎస్టీ టర్నోవర్‌ రూ.40 లక్షలకు మించిన వ్యాపారుల నుంచి ఎండీఆర్‌ వసూలు చేయాలని బ్యాంకింగ్‌ రంగం ప్రభుత్వానికి ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం… ఎండీఆర్‌ చార్జీలను శ్రేణుల వారీగా ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అంటే, బడా మర్చంట్ల నుంచి అధిక చార్జీ, చిన్న విక్రేతల నుంచి అత్యల్ప రుసుము వసూలు చేస్తే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనితో ప్రభుత్వం ఇప్పుడు ఎండీఆర్‌ ఛార్జీ విధిస్తే… ఇక బడా కంపెనీల్లో చెల్లించే బిల్లులు 1-2% భారం అవుతాయి.

ఎండీఆర్‌ అంటే..?

సాధారణంగా మనం యూపీఐ లేదా కార్డు ద్వారా షాపుల్లో చెల్లింపులు జరుపుతాం. ఆ లావాదేవీని సంబంధిత బ్యాంక్‌ ప్రాసెసింగ్‌ చేశాకే మనం చెల్లించిన సొమ్ము విక్రేత ఖాతాలో జమవుతుంది. ఈ లావాదేవీని ప్రాసెస్‌ చేసేందుకు విక్రేత బ్యాంక్‌కు చెలించాల్సిన రుసుమునే మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండీఆర్‌) అంటారు. ఆ మొత్తం లావాదేవీ విలువలో ఒక శాతం కంటే తక్కువే. అయితే, దేశంలో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం యూపీఐ, రూపే కార్డులపై ఎండీఆర్‌ ను 2022లో ఎత్తివేసింది. మాస్టర్‌, వీసా కార్డులు, క్రెడిట్‌ కార్డుల ద్వారా చెల్లింపులపై ఇప్పటికీ విక్రేతలు ఎండీఆర్‌ చెల్లించాల్సి ఉంటుంది.

Also Read : Delimitation: డీలిమిటేషన్ పై ఈ నెల 22న చెన్నైలో సమావేశం !

Leave A Reply

Your Email Id will not be published!