Sunita Williams: అంతరిక్షం నుండి బయలుదేరిన సునీతా విలియమ్స్‌! ప్రత్యక్ష ప్రసారం చేస్తోన్న నాసా!

అంతరిక్షం నుండి బయలుదేరిన సునీతా విలియమ్స్‌! ప్రత్యక్ష ప్రసారం చేస్తోన్న నాసా!

Sunita Williams : దాదాపు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్(Sunita Williams), మరో వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌ ఎట్టకేలకు భూమ్మీదకు రానున్నారు. వీరి తిరుగు ప్రయాణానికి సంబంధించిన ప్రక్రియ మొదలైంది. వ్యోమగాములను తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్‌ఎక్స్‌ క్రూ డ్రాగన్‌ లోకి వీరు అడుగుపెట్టారు. స్పేస్‌ఎక్స్‌ క్రూ డ్రాగన్‌ హ్యాచ్‌ మూసివేత ప్రక్రియ ప్రారంభమైనట్లు అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా వెల్లడించింది. అంతేకాదు ఆ దృశ్యాలను నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. తిరుగుప్రయాణం కోసం వ్యోమగాములు సిద్ధమవుతున్నారని, తమ వస్తువులను ప్యాక్‌ చేసుకుంటున్నారని పేర్కొంది. భూమ్మీదకు వచ్చే ముందు ఐఎస్‌ఎస్‌లో వ్యోమగాములంతా ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. ఈ ప్రక్రియనంతా నాసా కేంద్రంలోని శాస్త్రవేత్తలు సునిశితంగా గమనిస్తున్నారు.

Sunita Williams Journey to Earth

భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.15 గంటలకు హ్యాచ్‌ మూసివేత ప్రక్రియ ప్రారంభమైంది. ఇది పూర్తయిన తర్వాత ఉదయం 10.15 గంటలకు అన్‌డాకింగ్‌ ప్రక్రియ మొదలవుతుంది. క్రూ డ్రాగన్‌ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోతుంది. ఇక, భూవాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజిన్ల ప్రజ్వలనను బుధవారం తెల్లవారుజామున 2.41 గంటలకు చేపట్టనున్నారు. దాదాపు నలభై నిమిషాల తర్వాత తెల్లవారుజామున 3.27 గంటలకు ఈ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది. సహాయ బృందాలు రంగంలోకి దిగి… క్రూ డ్రాగన్‌ ను వెలికితీస్తాయి.

సునీతా విలియమ్స్(Sunita Williams), విల్మోర్‌ తో పాటు మరో ఇద్దరు వ్యోమగాములు పుడమిని చేరుకుంటారు. 2024 జూన్‌ 5న ప్రయోగించిన బోయింగ్‌ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్‌’లో సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే, స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటినుంచి సునీత, విల్మోర్‌లు ఐఎస్‌ఎస్‌లోనే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో నలుగురు వ్యోమగాములతో నింగిలోకి వెళ్లిన స్పేస్‌ఎక్స్‌ వ్యోమనౌక క్రూ డ్రాగన్‌ (క్రూ డ్రాగన్‌ క్యాప్సూల్‌-10) విజయవంతంగా భూ కక్ష్యలోనికి ప్రవేశించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)తో అనుసంధానమైంది. ఇప్పుడు అదే క్రూ డ్రాగన్ లో సునీత, విల్మోర్ భూమిని చేరుకోనున్నారు.

Also Read : Clashes in Nagpur: నాగ్ పూర్ లో చెలరేగిన అల్లర్లు! పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధింపు!

Leave A Reply

Your Email Id will not be published!