Popular Writer-Jnanpith Award: ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్ అవార్డు
ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్ అవార్డు
Jnanpith Award : ఆధునిక హిందీ సాహిత్యంలో చెరగని స్థానం సంపాదించుకున్న సుప్రసిద్ద హిందీ సాహితీవేత్త, కవి వినోద్ కుమార్ శుక్లా (88) కు దేశంలోనే అత్యున్నత సాహితీ గౌరవంగా భావించే 2024-జ్ఞాన్‌పీఠ్ పురస్కారం(Jnanpith Award) లభించింది. సృజనాత్మక, విలక్షణ రచనా శైలితో హిందీ సాహిత్యరంగానికి అందించిన విశిష్ట సేవలకు గానూ 59వ జ్ఞాన్‌పీఠ్‌కు శుక్లా ఎంపికయ్యారని కమిటీ పేర్కొంది. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయపూర్‌లో నివాసం ఉన్న వినోద్ కుమార్ శుక్లా అనేక నవలలు, కథలు, కవితలు రాశారు. ‘దీవార్ మే ఏక్ ఖిడ్కీ థీ’ అనే నవల రాసినందుకు ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. జ్ఞాన్‌పీఠ్ పురస్కారం కింద రూ.11 లక్షల నగదు, సరస్వతీదేవి కాంస్య ప్రతిమ, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. తాజా పురస్కారంపై ఆయన స్పందిస్తూ- ఇది చాలా పెద్దదని, తానేమాత్రం ఊహించలేదని చెప్పారు.
Writer Vinod Shukla Got Jnanpith Award
ప్రముఖ ఒడియా రచయిత్రి ప్రతిభా రే అధ్యక్షతన శనివారం సమావేశమైన జ్యూరీ వినోద్ కుమార్ శుక్లాకు(Vinod Kumar Shukla) జ్ఞానపీఠ్ పురస్కారం ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఈ పురస్కారాన్ని అందుకున్న హిందీ రచయితల్లో వినోద్ కుమార్ శుక్లా 12వ వారు కాగా, ఛత్తీస్ గఢ్ నుంచి జ్ఞాన్‌పీఠ్ అవార్డు అందుకోనున్న తొలి రచయిత. ఈ ఏడాది జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీతను ఎంపిక చేసేందుకు ఏర్పాటైన జ్యూరీలో ప్రతిభా రేతోపాటు కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్ కౌశిక్, ప్రముఖ రచయితలు ప్రభావర్మ, దామోదర్ మోజో, అనామిక, ప్రఫుల్ షిలేదార్, జానకీ ప్రసాద్ వర్మలతో పాటు ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి- కవి ఏ కృష్ణారావు కూడా ఉన్నారు.
1937 జనవరి 1న ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్‌లో జన్మించిన శుక్లా- అగ్రికల్చర్ ఎమ్మెస్సీ చదివారు. రాయ్‌పుర్ వ్యవసాయ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. ఆధునిక హిందీ సాహిత్యంలో ప్రయోగాత్మక రచనలకు పేరొందారు. ఆయన రచనలు సరళత, సున్నితత్వానికి ప్రతీకలు. ఆయన తొలికవితా సంపుటి లగ్బ్జైహింద్ 1971లో ప్రచురితమైంది. 1992లో ‘దీవార్ మే ఏక్ ఖిడ్కీ రహ్తీ థీ’ నవలకు ఆయన సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు. ఆయన రాసిన ‘నౌకర్ కి కమీజ్’, ‘ఖిలేగా తో దేఖేంగే’, ‘దేర్ యూజ్డ్ బి ఎ విండో ఇన్ ది వాల్’ అనేవి ఉత్తమ నవలలుగా పరిగణించబడ్డాయి. ‘దేర్ యూజ్డ్ టు బి ఎ విండో ఇన్ ది వాల్’ నవలకు 1999లో సాహిత్య అకాడమీ అవార్డును కూడా అందుకున్నారు. ఇటీవలే మాతృభూమి బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా లభించింది.
Also Read : Mehul Choksi: బెల్జియంకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ