CM Mamata Banerjee: సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ సర్కార్ కు స్వల్ప ఊరట
సుప్రీంకోర్టులో మమతా బెనర్జీ సర్కార్ కు స్వల్ప ఊరట
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ రాజకీయాలను కుదిపేసిన ఉపాధ్యాయ నియామక కుంభకోణం వ్యవహారంలో మమతా బెనర్జీ(Mamata Banerjee) ప్రభుత్వానికి స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు నిమిత్తం హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో కొన్నింటిని సుప్రీంకోర్టు తాజాగా పక్కనపెట్టింది. అదనపు పోస్టుల సృష్టిపై రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది.
CM Mamata Banerjee Case in Supreme Court
‘‘నిపుణులతో చర్చలు జరిపిన తర్వాతే బెంగాల్(West Bengal) విద్యాశాఖ ఈ అదనపు పోస్టులను సృష్టించింది. దీనికి గవర్నర్ నుంచి ఆమోదం లభించింది. అలాంటప్పుడు ఇందులో న్యాయపరమైన జోక్యం అవసరం లేదు’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. అయితే, టీచర్ల నియామకాల్లో ఇతర అవకతవకలకు సంబంధించిన ఇతర అంశాలు, ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతుందని కోర్టు పేర్కొంది.
ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులతో పాటు గ్రూప్ సి, గ్రూప్ డి స్టాఫ్ సిబ్బంది నియామకాల కోసం 2016లో బెంగాల్ సర్కారు రాష్ట్ర స్థాయి సెలక్షన్ పరీక్ష నిర్వహించింది. 24,650 ఖాళీల భర్తీ కోసం చేపట్టిన ఈ రిక్రూట్‌మెంట్ పరీక్షకు 23 లక్షల మందికి పైగా హాజరయ్యారు. అనంతరం ఇందులో ఎంపిక ప్రక్రియ చేపట్టి 25,753 మందికి అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేశారు. అయితే, ఖాళీలు ఉన్న సంఖ్య కంటే ఎక్కువ మందిని ఎంపిక చేయడంపై వివాదం రాజుకుంది. ఉద్దేశపూర్వకంగానే అదనపు పోస్టులను సృష్టించి అక్రమ నియామకాలు చేపట్టారని ఆరోపణలు వచ్చాయి.
దీనిపై విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు 2016 నాటి ఆ నియామక ప్రక్రియ చెల్లదని తీర్పు వెలువరించింది. అంతేగాక, ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల పాత్రతో పాటు అవకతవకలపై దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై గతంలో విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం… సీబీఐ దర్యాప్తుపై స్టే విధించింది. తాజాగా అదనపు ఉద్యోగాల సృష్టిపై దర్యాప్తు అవసరం లేదంటూ తీర్పు వెలువరించింది. ఇప్పటికే 25,753 మంది టీచర్ల నియామకాలు చెల్లవని సుప్రీంకోర్టు గతవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే.
Also Read : Supreme Court :తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ