Amaravati: అమరావతి-హైదరాబాద్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకి కేంద్రం పచ్చజెండా

అమరావతి-హైదరాబాద్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేకి కేంద్రం పచ్చజెండా

Amaravati : ఏపీ పునర్విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఏపీ, తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై ఆయా శాఖలకు కేంద్రహోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 3న కేంద్రహోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌ 15 శాఖల అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. కేంద్ర రోడ్లు-ఉపరితల రవాణా, ఉక్కు, బొగ్గు గనులు, వ్యవసాయ, పెట్రోలియం, రైల్వే తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ప్రతిపాదనలతో పాటు విభజన చట్టం ప్రకారం ఉన్న పెండింగ్‌ అంశాలపై చర్చించారు. ఆ సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ను ఇటీవల ఏపీ, తెలంగాణ సీఎస్‌లకు కేంద్రహోంశాఖ పంపించింది.

Amaravati – Hyderabad Express Way

ఈ సమీక్ష సమావేశంలో అమరావతి(Amaravati)-హైదరాబాద్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేకి కేంద్రం పచ్చజెండా ఊపింది. డీపీఆర్‌ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణాశాఖను హోంశాఖ ఆదేశించింది. తెలంగాణలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ వేగవంతానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో మరో రిఫైనరీ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఆ మేరకు పెట్రోలియం శాఖకు హోంశాఖ సూచనలు చేసింది.

విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ పనులు ముమ్మరంగా కొనసాగించాలని… రెండేళ్లలో అక్కడి నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని రైల్వేశాఖను ఆదేశించింది. విశాఖ, అమరావతి, కర్నూలు, హైదరాబాద్‌ కారిడార్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయని… దానిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించింది. గతంలో ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన నిధులు పెండింగ్‌లో ఉన్నందున విడుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. తెలంగాణకు ఆ నిధుల విషయంపై నీతిఆయోగ్‌తో చర్చించాలని అధికారులకు హోంశాఖ సూచించింది.

Also Read : Mark Shankar Pawanovich: కోలుకుంటోన్న పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్

Leave A Reply

Your Email Id will not be published!