Delhi Police: ఢిల్లీలో పసిబిడ్డల విక్రయ ముఠా అరెస్టు
ఢిల్లీలో పసిబిడ్డల విక్రయ ముఠా అరెస్టు
Delhi Police : నవజాత శిశువులను అపహరించి… ధనవంతులకు 5 నుండి 10 లక్షలకు విక్రయిస్తున్న ఓ ముఠాను ఢిల్లీ పోలీసులు(Delhi Police) అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి నాలుగు రోజులున్న ఇద్దరు చిన్నారులను రక్షించినట్లు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…
Delhi Police Action
గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులే లక్ష్యంగా ఈ ముఠా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 35 మంది చిన్నారులను విక్రయించింది. ఇటీవల ద్వారకా జిల్లాలోని ఉత్తమ్ నగర్ లో కొందరు వ్యక్తులు ఓ శిశువును విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకోవడంతో ఈ ముఠా గుట్టు రట్టయ్యింది.
అపహరించిన శిశువులను ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న మురికివాడల్లో ఉంచి… పిల్లలు లేని ధనవంతులకు వారిని 5 నుంచి 10 లక్షలకు విక్రయిస్తున్నారు. వారి నుంచి ఇద్దరు నవజాత శిశువులను కాపాడామని… చిన్నారులు గుక్కపట్టి ఏడుస్తున్నా పట్టించుకోకుండా నిందితులు వారి విక్రయానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. మురికివాడల్లోనే కాకుండా దేశ రాజధానిలోని ధనవంతుల నివాస ప్రాంతాల్లో కూడా ఈ ముఠాకు విస్తృతమైన నెట్‌వర్క్ ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ రాకెట్‌లో కొందరు వైద్యుల సహకారం కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. శిశువులను ఎవరెవరికి విక్రయించారనే విషయాన్ని తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Also Read : IAS Officers Transfers: ఏపీలో ఎనిమిది మంది ఐఏఎస్‌లు బదిలీ