Supreme Court: బాలల అక్రమ రవాణా కేసు నిందితులపై సుప్రీకోర్టు ఆగ్రహం

బాలల అక్రమ రవాణా కేసు నిందితులపై సుప్రీకోర్టు ఆగ్రహం

Supreme Court : బాలల అక్రమ రవాణా నేరగాళ్లు సమాజానికి పెద్ద ముప్పుగా పరిణమించారని సుప్రీంకోర్టు(Supreme Court) ఆందోళన వ్యక్తంచేసింది. దేశంలో బాలల అక్రమ రవాణా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని… నిందితులు ఎప్పటికప్పుడు నేరాల పోకడలను మారుస్తూ చట్టం నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. బాధితులను ఏమారుస్తున్నారని, ఒక్కో రాష్ట్రంలో ఒక్కోవిధమైన రీతిలో అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారని తెలిపింది. న్యాయస్థానాలు, రాష్ట్రప్రభుత్వాలు ఈ నేరాల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌ ధర్మాసనం మంగళవారం పేర్కొంది.

Supreme Court Of India Slams

బాలల అక్రమ రవాణా(Child Trafficking) కేసులో నిందితులైన 13 మందికి అలహాబాద్‌ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు వ్యవహరించిన తీరునూ ధర్మాసనం తప్పుపట్టింది. సమష్ఠి న్యాయం, సామరస్య జీవనం కోసం వస్తోన్న అభ్యర్థనలను చులకనగా చూడరాదని హితవుపలికింది. నేర తీవ్రతను పసిగట్టి నిందితులకు అనుకూలమైన నిర్ణయం వెలువరించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. హైకోర్టు తీర్పును ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం సవాల్‌ చేయకపోవడాన్నీ సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. అక్రమ రవాణా బాధితులైన చిన్నారులందరినీ పాఠశాలల్లో చేర్పించి వారందరికీ ఉచిత, నిర్బంధ విద్యను అందించాలని రాష్ట్ర సర్కారును ఆదేశించింది.

బాలల అక్రమ రవాణా కేసుపై సెషన్స్‌కోర్టులో విచారణ ప్రారంభమయ్యేలా చూడాలని అలహాబాద్‌ హైకోర్టు, వారణాసి జిల్లా కోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. వారంలోగా నిందితులపై అభియోగాలు మోపాలంటూ గడువు విధించింది. పరారీలో ఉన్న నిందితులు వెంటనే కోర్టుకు లొంగిపోయేలా చూడాలని పేర్కొంది.

బాలల అక్రమ రవాణాకు పాల్పడిన ఆసుపత్రుల లైసెన్సులు రద్దు – సుప్రీంకోర్టు

నవజాత శిశువుల కిడ్నాప్‌ కేసుల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వ నిర్లక్ష్యంపైనా దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ ఆసుపత్రిలో అయినా చిన్నారుల అక్రమ రవాణా జరిగినట్లు తేలితే వెంటనే దాని లైసెన్స్‌ రద్దు చేయాలని జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌ ధర్మాసనం ఆదేశించింది. ఇటీవల ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ఓ ఆసుపత్రిలో నవజాత శిశువు అపహరణకు గురయ్యాడు. చిన్నారి తల్లిదండ్రులు… పోలీసులను ఆశ్రయించే లోపే గుర్తుతెలియని వ్యక్తి ఆ చిన్నారిని విక్రయించాడు. అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించిన దంపతులకు నిరాశే మిగిలింది. నిందితుడికి బెయిల్‌ మంజూరు చేయడాన్ని సవాల్‌ చేస్తూ బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్రమ రవాణా పెండింగ్‌ కేసులకు సంబంధించి దేశవ్యాప్తంగా విచారణ ఎలా కొనసాగుతుందో తెలియజేయాలని అన్ని హైకోర్టులను సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం ఆదేశించింది. నిందితుడి బెయిల్‌ రద్దు చేసింది. బాలల అక్రమ రవాణా ముప్పుపట్ల తల్లిదండ్రులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. చట్టబద్ధమైన దత్తత ప్రక్రియ ఆలస్యం కావడంతో పిల్లలను దక్కించుకునే ఆరాటంలో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారని తెలిపింది.

Also Read : Sonia Gandhi: ‘నేషనల్‌ హెరాల్డ్‌’ కేసులో సోనియా, రాహుల్‌ లపై ఈడీ ఛార్జిషీట్‌

Leave A Reply

Your Email Id will not be published!