Shubhanshu Shukla: వచ్చే నెలలో అంతరిక్షకేంద్రానికి భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా
వచ్చే నెలలో అంతరిక్షకేంద్రానికి భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా
Shubhanshu Shukla : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో), అమెరికాకు చెందిన యాక్సియమ్ స్పేస్, స్పేస్ ఎక్స్ లు కలిసి మే నెలలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లోకి పంపించే యాక్సియమ్ మిషన్-4(ఏఎక్స్-4)లో ముగ్గురు అంతర్జాతీయ వ్యోమగాములతోపాటు… భారత్ వ్యోమగామి, భారత వాయుసేన పైలట్, గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా(Shubhanshu Shukla) కూడా అంతరిక్ష యాత్రకు వెళ్ళనున్నారు. ఈ మిషన్‌లో భాగంగా వారు రెండువారాలపాటు ఐఎస్‌ఎస్‌లోనే ఉంటారు. శుక్లా ఈ రెండువారాలూ అక్కడ పలు ప్రయోగాలు చేయనున్నారు. భారత అంతరిక్ష పరిశోధనల సంస్థ (ఇస్రో) ప్రాజెక్టులను సమీక్షించిన కేంద్ర మంత్రి జితేంద్రసింగ్… ఈ విషయాన్ని వెల్లడించారు. శుక్లా చేయబోయే ఈ ప్రయాణాన్ని ఆయన… అంతరిక్ష అన్వేషణల నవశకంలోకి భారత్ ధైర్యంగా వేస్తున్న అడుగులకు సంకేతంగా, అంతర్జాతీయ అంతరిక్ష భాగస్వామ్యాల విస్తరణలో ఇండియాఅధిగమిస్తున్న కీలక మైలురాయిగా అభివర్ణించారు. ఈ అంతర్జాతీయ భాగస్వామ్యాలు, గగన్ యాన్ వంటి ప్రాజెక్టులు… స్పేస్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్‌గా ఎదగాలన్న భారతదేశ చిత్తశుద్ధిని ప్రతిఫలిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
అయితే, శుక్లా(Shubhanshu Shukla) ఐఎస్‌ఎస్ కు వెళ్లేది ఇస్రో చేపట్టిన మిషన్‌లో భాగంగా కాదు. అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష పరిశోధనల సంస్థ ‘యాక్సియం స్పేస్’ చేపట్టిన ‘యాక్సియం 4’ మిషన్‌లో భాగంగా మరో ముగ్గురు విదేశీ వ్యోమగాములతో కలిసి ఆయన వెళ్లనున్నారు. అమెరికన్(America) వ్యాపారదిగ్గజం ఈలన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ వ్యోమనౌక క్రూడ్రాగన్ వారిని ఐఎస్‌ఎస్‌కు చేరవేయనుంది. ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా క్రూడ్రాగన్‌ను దిగువ భూ కక్ష్యలోకి ప్రవేశపెడతారు. అమెరికన్ వ్యోమగామి, నాసాకు చెందిన పెగ్గీ వాట్సన్ కమాండర్ గా ఉండే ఈ మిషన్‌లో… శుక్లా పైలట్ గా వ్యవహరిస్తారు. వీరితోపాటు పోలండ్ కు చెందిన స్వావోష్ ఊజ్‌నైన్‌స్కీ, హంగరీకి చెందిన టైబోర్ కాఫూ వెళ్లనున్నారు. ఆయా దేశాల నుంచి రోదసిలోకి వెళ్లనున్న తొలి వ్యోమగాములు వారే కావడం విశేషం.
Shubhanshu Shukla – అంతరిక్ష కేంద్రానికి అరుదైన నీటి ఎలుగుబంటి
యాక్సియమ్ మిషన్-4(ఏఎక్స్-4)లో వ్యోమగాములతోపాటు భూమి మీద అత్యంత అరుదైన జీవి నీటి ఎలుగుబంటి(టార్డిగ్రేడ్) కూడా వెళ్లనుంది. యాక్సియమ్ మిషన్‌ను ప్రైవేట్ వ్యోమనౌక క్రూడ్రాగన్ జీ213 ద్వారా పంపించనున్నారు. 14-21 రోజులపాటు ఐఎస్‌ఎస్‌లో ఉండే ఈ మిషన్‌లో నలుగురు వ్యోమగాములుంటారు. ఇందులో భారతీయ వైమానిక దళం టెస్ట్ పైలట్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా(Shubhanshu Shukla) ఒకరు. ఇప్పుడు వీరందరితో నీటి ఎలుగుబంటిని పంపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి.
నీటి ఎలుగుబంటి ఎందుకు ?
టార్డిగ్రేడ్, సూక్ష్మ కణజాల జీవిగా పిలిచే నీటి ఎలుగుబంటి భూమండలంపై జీవించి ఉండే అత్యంత అరుదైన జీవి. 0.3 మి.మీల నుంచి 0.5 మి.మీల పొడవు ఉండి పర్యావరణంలో అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకుని జీవించే డీఎన్‌ఏను కలిగి ఉంటుంది. పర్వతాలు, సముద్రాలు, ఎడారులతోపాటు సూర్యరశ్మి నేరుగా పడే ప్రదేశాల్లోనూ జీవించగలదు. నీటి ఊబిలో ఎక్కువగా జీవిస్తుంటుంది. దీని శరీరంలోని కణాలకు నీటిని భర్తీ చేసుకునే లక్షణం ఉండడంతో సంవత్సరాల పాటు అదే నీటితో బతకగలదు. ఇలాంటి అరుదైన జీవి డీఎన్‌ఏను డీకోడ్ చేసిన ఇస్రో… సూక్ష్మ గురుత్వాకర్షణ శక్తిలో పునరుత్పత్తిని.. భూమి, అంతరిక్షంలో జన్యు మార్పిడిని అధ్యయనం చేయనుంది. అత్యంత శక్తిమంతమైన సూర్యరశ్మితో పాటు గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలో ఈ జీవి డీఎన్‌ఏలో కలిగే మార్పులకు అనుగుణంగా వ్యోమగాముల రక్షణ వ్యవస్థలను తయారు చేయనుంది. ఈ అధ్యయనం త్వరలో ప్రయోగించే మానవసహిత గగన్‌యాన్ మిషన్‌కూ ఉపయోగపడనుందని ఇస్రో అంచనా వేస్తోంది.
శుక్లా నేపథ్యం ఏమిటంటే ?
శుబాన్షు శుక్లా 1985లో యూపీలోని(UP) లఖ్ నవూలో జన్మించారు. 2006 జూన్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ వింగ్ లో చేరారు. ఎస్‌యు-30 ఎంకేఐ, మిగ్ 21, మిగ్ 29, జాగ్వార్, హాక్, డోర్నియర్, ఏఎన్-32 సహా పలు రకాల విమానాలను 2000 గంటలపాటు నడిపి అపార అనుభవాన్ని గడించారు. 2024 నాటికి గ్రూప్‌కెప్టెన్ స్థాయికి చేరుకున్నారు. తన కెరీర్ లో ఎన్నో అవార్డులు, పతకాలు సాధించిన శుక్లాకు 2019లో ఇస్రో నుంచి పిలుపు వచ్చింది. దరిమిలా ఆయన మాస్కో(రష్యా)లోని యూరీ గగారిన్ కాస్మొనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో వ్యోమగామి శిక్షణ పొందారు. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌కు ఆయన్ను వ్యోమగామిగా ఎంపిక చేసినట్టు ప్రధాని మోదీ 2024 ఫిబ్రవరి 27న ప్రకటించారు. 2024లోనే… యాక్సియం 4 మిషన్ కు ప్రధాన వ్యోమగామిగా శుక్లా ఎంపికయ్యారు. ఈ మిషన్‌లో భాగంగా ఐఎస్‌ఎస్‌కు వెళ్లడం వల్ల… స్పేస్‌ఫ్లైట్ ఆపరేషన్స్, లాంచ్ ప్రోటోకాల్స్ వంటివాటిలో అనుభవం సంపాదించే అవకాశం ఆయనకు లభిస్తుంది. గగన్‌యాన్ మిషన్‌లో ఈ అనుభవాలు ఆయనకు ఎంతగానో ఉపకరిస్తాయి.
Also Read : Building Collapsed: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం ! నలుగురు మృతి !