Encounter: ఝార్ఖంఢ్ లో భారీ ఎన్ కౌంటర్ ! మావోయిస్టు ప్రయాగ్ మాంఝీ హతం !
ఝార్ఖంఢ్ లో భారీ ఎన్ కౌంటర్ ! మావోయిస్టు ప్రయాగ్ మాంఝీ హతం !
Encounter : చత్తీస్ ఘడ్ లో వరుస ఎన్ కౌంటర్లతో సతమతమౌతున్న మావోయిస్టులకు ఝార్ఖంఢ్ లో మరో ఎదురుదెబ్బ తగిలింది. ఝార్ఖంఢ్ లోని బొకారో జిల్లాలో లాల్‌పానియా ప్రాంతంలోని లుగు పర్వత పాదాల వద్ద సీఆర్‌పీఎఫ్ భద్రతా దళాలు, స్టేట్ పోలీస్ కోబ్రా కమాండోలకు మావోయిస్టులకు(Maoists) మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్ కౌంటర్(Encounter) లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో మావోయిస్టు కీలకనేత ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్ ఉన్నాడు. ప్రయాగ్ ను ఫుచన, నాగ మాంఝీ, కరన్, లెతర అనే పేర్లతో కూడా పిలుస్తారు. ప్రయాగ్ మాంఝీ అలియాస్ వివేక్ పై జాతీయ దర్యాప్తు సంస్థ ఇప్పటికే రూ. కోటి రివార్డ్‌ను ప్రకటించింది. ఈ ఎన్‌కౌంటర్లో చనిపోయిన ఎనిమిది మందిలో అరవింద్, రామ్ మాంఝీ అనే మావోయిస్టులు ఉన్నారు. వీరిపై కూడా రూ.10 లక్షలు చొప్పున రివార్డులు ఉన్నాయి. ఈ ఎన్ కౌంటర్ తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో చోటుచేసుకొన్నట్లు స్థానిక పత్రికలు పేర్కొంటున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
Encounter – ప్రయాగ్ అడ్డాగా ప్రశాంత్ హిల్స్
కేంద్ర కమిటీ సభ్యుడైన ప్రయాగ్ మాంఝీ ముఖ్యంగా ప్రశాంత్ హిల్స్ కేంద్రంగా తన కార్యకలాపాలు నిర్వహించేవాడు. ధనాబాద్ జిల్లా తుండీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దల్ బుద అతడి స్వగ్రామం. ఝార్ఖండ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో దాదాపు 100 దాడుల్లో ఇతడి హస్తం ఉంది. ఒక్క గిరిధి జిల్లాలోనే ఇతడిపై 50 కేసులతో పాటు రూ. కోటి రివార్డ్ ఉంది. ఝార్ఖంఢ్‌లో(Jharkhand) అత్యధిక రివార్డ్ ఉన్న రెండో మావోయిస్టు ఇతడే. మాంఝీ కాకుండా మరో నలుగురి పైనే రూ.కోటి రివార్డులు ఉన్నాయి. ఇతడు పరస్నాథ్ ప్రాంతంలోకి ప్రవేశించినట్లు సమాచారం అందడంతో పోలీసులు వేగులను అప్రమత్తం చేశారు. కొన్నాళ్ల క్రితం అతడిని చూడటంతో రూఢీ చేసుకొన్నారు.
సోమవారం తెల్లవారుజామున సీఆర్‌పీఎఫ్, రాష్ట్ర పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. వీరికి లుగు హిల్స్ వద్ద మావోయిస్టులు ఎదురుపడటంతో ఎన్‌కౌంటర్ మొదలైంది. ఆ తర్వాత కొద్దిసేపటికి మావోలు అడవుల్లోకి పారిపోయారు. మొత్తం 8 మృతదేహాలను స్వాధీనం చేసుకొన్నారు. వీరిలో ప్రయాగ్ ఉన్నట్లు గుర్తించారు. తాజా ఆపరేషన్ లో ఎస్‌ఎల్‌ఆర్, ఇన్సాస్ వంటి భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నారు. 209 కోబ్లా బెటాలియన్, ఝార్ఖండ్ పోలీసులు ఆ ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఈ ఏడాది జార్ఖండ్ లో జరిగిన ఎన్‌కౌంటర్లలో మొత్తం 13 మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు. 2025 చివరికి రాష్ట్రాన్ని మావో రహిత రాష్ర్టంగా చేయాలని పోలీసులు లక్ష్యంగా పెట్టుకొన్నారు. 244 మంది మావోయిస్టులను రాష్ట్రంలో అరెస్టు చేశారు. పలు దళాల కమాండర్లతో కలిపి 24 మంది లొంగిపోయారు.
ఏడాది క్రితమే ప్రయాగ్ భార్య జయా అరెస్ట్
ప్రయాగ్ మాంఝీ భార్య జయాను గతేడాది పోలీసులు అరెస్టు చేశారు. ఆమె క్యాన్సర్‌తో బాధపడుతోంది. చికిత్స తీసుకోవడానికి వచ్చిన సమయంలో నాడు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ మృతి చెందింది.
Also Read : Rahul Gandhi: కేంద్ర ఎన్నికల వ్యవస్థపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు