AB Venkateswara Rao: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు మళ్లీ విచారణ చేపట్టాలి – ఏబీ వెంకటేశ్వరరావు
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు మళ్లీ విచారణ చేపట్టాలి - ఏబీ వెంకటేశ్వరరావు
AB Venkateswara Rao : ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చేతిలో దారుణ హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు(AB Venkateswara Rao) సోమవారం కలిశారు. 2022 మే 20న జరిగిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఏపీ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు… తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి… తన కారులోనే ఇంటి దగ్గరకు తీసుకువచ్చి పడేసాడు. దీనితో దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేసారంటూ… పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ వైసీపీ అధినేత జగన్… అనంతబాబును వెనకేసుకురావడం… దళిత వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత పెంచింది. అయితే ఇటీవల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో… తన కుమారుడి హత్య కేసులో తమకు న్యాయం జరుగుతుందని సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.
AB Venkateswara Rao Meet
ఈ నేపథ్యంలో గత ఐదేళ్ళ వైసీపీ(YCP) ప్రభుత్వంలో బాధితులుగా మారిన కుటుంబాలను రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు ఒక్కొక్కరిని కలుస్తున్నారు. ఇటీవల కోడికత్తి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావును కలిసిన ఏబీ వెంకటేశ్వరరావు… సోమవారం సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో జరిగినంత లోపభూయిష్టమైన దర్యాప్తును తన 35 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు.
‘‘దళిత యువకుడు చనిపోయాడు న్యాయం చేయాలన్న ఆలోచన లేకుండా, కేసు వీగిపోయేలా నివేదికలు ఇచ్చారు. ఎఫ్‌ఐఆర్‌కి, ఛార్జ్ షీట్ కి సంబంధం లేదు. మధ్యవర్తులు చెప్పేదానికి, ఎస్పీ వాదనకు పొంతన లేదు. ఛార్జిషీటు దానంతట అదే వీగిపోయేలా, కేసు కొట్టేసేలా ఈ కేసును నీరుగార్చారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ చరిత్రలోనే ఒక మచ్చగా మిగిలిపోయే దర్యాప్తు ఇది. న్యాయస్థానం అనుమతితో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి… మళ్లీ మొదటి నుంచి విచారణ చేపట్టాల్సిన అవసరముంది. ఈ విషయమై కాకినాడ కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వచ్చాను. కాకినాడలో ఓ అపార్ట్‌మెంట్‌లో పని చేసుకునే కుటుంబం… బెదిరింపులకు భయపడి ఒక మారుమూల పల్లెలో నాలుగు ఇళ్లల్లో పాచిపనులు చేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఈ కుటుంబానికి న్యాయం చేయాలి’’ అని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.
Also Read : 10th Class Results: 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలకు ముహూర్తం ఫిక్స్