Government of India: జనగణనతో పాటు కులగణనకు కేంద్రం నిర్ణయం

జనగణనతో పాటు కులగణనకు కేంద్రం నిర్ణయం

Government of India : దేశంలో ప్రతిపక్ష పార్టీలు ఎంతోకాలంగా డిమాండ్‌ చేస్తున్న కులగణనకు కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. త్వరలో దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనగణనలో భాగంగా కులగణనను కూడా నిర్వహించాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నిర్వహించిన కేంద్ర రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీపీఏ) సమావేశంలో ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

Government of India …

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 246 ప్రకారం ‘గణన’అనేది కేంద్ర జాబితాలో 69వ అంశంగా ఉందని, అందువల్ల జనగణన, కులగణన బాధ్యత పూర్తిగా కేంద్రం పరిధిలోనిదని స్పష్టంచేశారు. కొన్ని రాష్ట్రాలు తమకు అధికారాలు లేకపోయినా సర్వేల పేరుతో కులాల లెక్కలను అశాస్త్రీయంగా సేకరించాయని ఆరోపించారు. ఆ సర్వేల వల్ల గందరగోళం ఏర్పడి సమాజంలో చీలికలు రాకూడదన్న ఉద్దేశంతోనే పక్కా శాస్త్రీయంగా కులగణన(Caste Census) నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

కులగణనకు కాంగ్రెస్‌ ఎప్పుడూ వ్యతిరేకమే – అశ్వినీ వైష్ణవ్‌

కులగణనకు కాంగ్రెస్‌ పార్టీ(Congress) ఎప్పుడూ వ్యతిరేకమేనని మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఆరోపించారు. గతంలో కులగణనను కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వ్యతిరేకిస్తూ వచ్చాయని తెలిపారు. ‘కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఎప్పుడూ కులగణనను వ్యతిరేకిస్తూ వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నిర్వహించిన ఏ జనాభా గణనలోనూ కులగణనను చేర్చలేదు. 2010లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ కులగణన అంశాన్ని కేబినెట్‌లో పరిశీలిస్తామని లోక్‌ సభకు హామీ ఇచ్చారు. ఈ అంశంపై మంత్రుల బృందాన్ని ఏర్పాటుచేస్తే చాలా రాజకీయ పార్టీలు కులగణనకు అనుకూలంగా అభిప్రాయాలు తెలిపాయి. అయినా కాంగ్రెస్‌ ప్రభుత్వం కులగణనకు బదులుగా సోషియో ఎకనామిక్‌ అండ్‌ క్యాస్ట్‌ సెన్సెస్‌ (ఎస్‌ఈసీసీ) సర్వే నిర్వహించాలని నిర్ణయించింది’అని మండిపడ్డారు.

కులగణనను(Caste Census) ప్రతిపక్ష ఇండియా కూటమి రాజకీయ సాధనంగా వాడుకుంటోందని అశ్వినీ వైష్ణవ్‌ ఆరోపించారు. ‘కొన్ని రాష్ట్రాలు కుల సర్వేలను బాగానే నిర్వహించాయి. కొన్ని రాష్ట్రాలు మాత్రం పారదర్శకత లేకుండా పూర్తిగా రాజకీయ కోణంలో నిర్వహించాయి. ఇటువంటి సర్వేలు సమాజంలో సందేహాలను లేవనెత్తాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని దేశంలోని సున్నితమైన సామాజిక నిర్మాణం రాజకీయాల వల్ల చెదిరిపోకుండా కాపాడటానికే సర్వేలకు బదులుగా కులగణనను పారదర్శకంగా నిర్వహించాలని సీసీపీఏ నిర్ణయించింది. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏ వర్గానికి ఇబ్బంది కలిగించకుండా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది’అని మంత్రి గుర్తుచేశారు.

దేశంలో ఏ కులం జనాభా ఎంత ఉందో తెలుసుకునేందుకు కులగణన నిర్వహించాలని కాంగ్రెస్‌సహా పలు ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తూ వస్తున్నాయి. గత లోక్‌ సభ ఎన్నికల్లో కూడా ఈ అంశం ప్రధాన ప్రచారాస్త్రాల్లో ఒకటిగా నిలిచింది. తమ ఒత్తిడి కారణంగానే కేంద్రం కులగణనకు నిర్ణయం తీసుకుందని, ఇది సంపూర్ణంగా తమ విజయమని కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చరిత్రాత్మకమని బీజేపీ, ఎన్డీయే(NDA Govt) మిత్రపక్షాలు పేర్కొన్నాయి.

మనదేశంలో జనాభా లెక్కల సేకరణ బ్రిటీష్‌ పాలనాకాలంలో 1881లో మొదలైంది. అప్పటి నుంచి ప్రతి పదేళ్లకు ఒకసారి దేశవ్యాప్తంగా ప్రభుత్వం నియమించే ఎన్యూమరేటర్లు ఇంటింటికీ వెళ్లి జనాభా లెక్కలను సేకరిస్తున్నారు. ఈ జనగణనలో ప్రజల సంఖ్యతోపాటు వారి ఆర్థిక స్థితి, జనాభా పెరుగుదల రేటు, మహిళలు– పురుషుల సంఖ్య, లింగ నిష్పత్తి, జనన– మరణాల రేటు వంటి సకల వివరాలను రికార్డు చేస్తున్నారు. నిజానికి మొదటి జనగణనతోపాటే… అంటే 1881లో తొలిసారి నిర్వహించిన జనగణనలో కులగణన కూడా నిర్వహించారు. 1931 వరకు ఈ విధానం కొనసాగింది. ఆ తర్వాత జనగణన నుంచి కులగణనను తప్పించారు. కానీ, ఎస్సీ, ఎస్టీల సంఖ్యను మాత్రం లెక్కిస్తూ వస్తున్నారు. దీనితో ఓబీసీ, ఓసీల జనాభా ఎంత ఉందన్న అంశంపై స్పష్టత లేకుండా పోయింది.

దేశంలో చివరి జనగణన 2011లో జరిగింది. 2020లో నిర్వహించాల్సిన జనగణనను కోవిడ్‌–19 కారణంగా వాయిదా వేశారు. త్వరలోనే జనగణన నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. అందులోనే కులగణనను చేర్చాలని తాజాగా నిర్ణయించింది. మనదేశంలో జనగణన సుదీర్ఘ ప్రక్రియ. ఇంటింటికి వెళ్లి వివరాల సేకరణ మొదలు.. పూర్తి డేటాను ప్రకటించటానికి దాదాపు 18 నెలల సమయం పడుతుంది.

Also Read : BSF: మరో పెద్ద ఉగ్రదాడిని అడ్డుకున్న బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు

Leave A Reply

Your Email Id will not be published!