Jawan Murali Naik: కాశ్మీర్ లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్
కాశ్మీర్ లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్
Jawan Murali Naik : ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడిచేసి నేటమట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్… సరిహాద్దులో కాల్పులకు పాల్పడుతూ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లో జరిపిన దాడుల్లో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాను మురళీ నాయక్ వీరమరణం పొందారు. గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ కల్లితండాకు చెందిన మురళీనాయక్ మృతిచెందినట్లు కుటుంబసభ్యులకు శుక్రవారం ఉదయం సమాచారం అందింది. సరిహద్దులో చొరబాటు దారుల కాల్పుల్లో ఆయన మృతిచెందినట్లు అధికారులు వారికి తెలిపారు.
2022లో అగ్నివీర్ జవానుగా సైన్యంలో చేరిన మురళీనాయక్… రెండు రోజుల క్రితం వరకు నాసిక్ లో విధులు నిర్వర్తించారు. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్మీ అధికారులు ఆయన్ను నాసిక్ నుంచి జమ్మూకశ్మీర్ కు పిలిపించారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున చొరబాటు దారుల కాల్పుల్లో మురళీనాయక్ మరణించారు. ఈ సమాచారం తెలియడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీనితో మంత్రి సవిత హుటాహుటీన కల్లితండాకు వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.5లక్షల చెక్కును మురళీనాయక్ తల్లిదండ్రులకు ఆమె అందజేశారు. కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. జై జవాన్ జోహార్ మురళి నాయక్ అంటూ నినాదాలు చేశారు. వీర జవాన్ మురళీనాయక్(Jawan Murali Naik) చిత్రపటానికి మంత్రి సవిత నివాళులర్పించారు.
Jawan Murali Naik – మృతుని కుటుంబ సభ్యలను పరామర్శించిన సీఎం చంద్రబాబు
భారత్ – పాకిస్థాన్ యుద్ధ భూమిలో వీరమరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్(Jawan Murali Naik) కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) ఫోన్‌లో పరామర్శించారు. దేశ రక్షణలో మురళీ నాయక్ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మురళీ నాయక్ తల్లిదండ్రులు జ్యోతిబాయి, శ్రీరాం నాయక్ లతో ఫోన్ లో మాట్లాడి పరామర్శించారు. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించిన మురళి త్యాగాన్ని దేశమంతా గుర్తుపెట్టుకుంటుందన్నారు. 25 ఏళ్ల వయసులోనే దేశం కోసం అమరుడైన మురళి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వీరజవాన్ మురళి తల్లిదండ్రుల ఆవేదన తీర్చలేనిదని… వారు ధైర్యంగా ఉండాలని కోరుతున్నానని సీఎం చంద్రబాబు అన్నారు.
మురళి త్యాగాన్ని జాతి మరువదు – పవన్
ఆపరేషన్ సిందూర్‌లో వీర మరణం పొందిన జవాన్ మురళీ నాయక్(Jawan Murali Naik) త్యాగాన్ని భారత జాతి ఎన్నడూ మరచిపోదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. జమ్ము కశ్మీర్ సరిహద్దుల్లో శత్రు మూకలతో పోరాడి మరణించిన మురళీ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కల్లి తండాకు చెందిన ఈ యువ జవాన్ దేశ రక్షణకు అంకితమై, సమర భూమిలో అమరులయ్యారన్నారు. ఈ వీరుడి తల్లితండ్రులు జ్యోతి బాయి, శ్రీరామ్ నాయక్, ఇతర కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆ కుటుంబానికి భరోసా ఇస్తుందని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
ఢిల్లీ ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
భారత్, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ రాష్ట్ర ప్రజల సౌకర్యార్థం ఢిల్లీలోని ఆంధ్రభవన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పాకిస్తాన్‌తో సరిహద్దు గల రాష్ట్రాలలో ఉన్న లేదా ఆ రాష్ట్రాలకు వెళుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సౌకర్యార్థం ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని సీఎం వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్, లడక్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఉన్న లేదా రాష్ట్రాలకు వెళుతున్న ఆంధ్రులు సమాచారం, సహాయం కొరకు నిరంతరం పనిచేసే కంట్రోల్ రూమ్‌ను సంప్రదించవచ్చునని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
Also Read : Territorial Army: రంగంలోనికి టెరిటోరియల్ ఆర్మీ ! ఆర్మీ చీఫ్ కు కేంద్రం పూర్తి అధికారాలు !