Hyderabad Police: శంషాబాద్ ఎయిర్ పోర్టు పరిధిలో డ్రోన్లపై నిషేధం
శంషాబాద్ ఎయిర్ పోర్టు పరిధిలో డ్రోన్లపై నిషేధం
Hyderabad Police : భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధించారు. విమానాశ్రయానికి 10 కి.మీ. పరిధిలో డ్రోన్లపై నిషేధం విధించినట్లు సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి వెల్లడించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ తెలిపారు. డ్రోన్లపై నిషేధం జూన్ 9 వరకు అమల్లో ఉంటుందని చెప్పారు.
Hyderabad Police – బాణసంచా కాల్చడంపై నిషేధం – సీపీ సీవీ ఆనంద్
అలాగే హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో బాణసంచా కాల్చడంపై నిషేధం విధించినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్(CP CV Anand) తెలిపారు. ప్రజల భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాలు, కంటోన్మెంట్ ప్రాంతాల్లో బాణసంచా కాల్చడంపై నిషేధం విధించినట్లు చెప్పారు. ఆకస్మిక శబ్దాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయొద్దని విజ్ఞప్తి చేశారు. బాణసంచా పేలుళ్లను ఉగ్ర కార్యకలాపాలుగా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందన్నారు. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో పౌరులు సహకరించాలని, పోలీసుల ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
రైల్వేస్టేషన్లలో భద్రత మరింత కట్టుదిట్టం చేసిన రైల్వే శాఖ
భారత్ – పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు. హైదరాబాద్ మహానగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్లైన సికింద్రాబాద్, కాచిగూడలో భారీగా భద్రతను పెంచినట్లు తెలిపారు. సీసీ కెమెరాల సంఖ్యను సైతం పెంచి పర్యవేక్షణ చేస్తున్నట్లు శ్రీధర్ పేర్కొన్నారు. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రత కారణాల దృష్ట్యా దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాలను మూసి వేయడంతో రైల్వేస్టేషన్లకు ప్రయాణికుల తాకిడి పెరిగిందన్నారు. దీంతో భద్రత కోసం ప్రత్యేక బలగాలను మోహరించినట్లు చెప్పారు. ప్రయాణికుల రద్దీకీ అనుగుణంగా ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నామని సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు.
Also Read : Miss World 2025: హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైన మిస్ వరల్డ్-2025 పోటీలు