Shubhanshu Shukla: శుభాంశు శుక్లా రోదసి యాత్రకు ముహూర్తం ఫిక్స్ ! ఎప్పుడంటే ?
శుభాంశు శుక్లా రోదసి యాత్రకు ముహూర్తం ఫిక్స్ ! ఎప్పుడంటే ?
Shubhanshu Shukla : భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్రకు ముహూర్తం ఫిక్స్ అయింది. యాక్సియం-4 (ఏఎక్స్-4) మిషన్‌లో భాగంగా జూన్ 8న ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) పయనం కానున్నారు. ఈ మేరకు యాక్సియం స్పేస్, నాసా ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. వాస్తవానికి మే 29వ తేదీకే ఈ మిషన్‌ను షెడ్యూల్ చేయగా… కొన్ని సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది. దీనితో వచ్చే నెలలో ప్రయోగం చేపట్టనున్నారు.
Shubhanshu Shukla…
భారత కాలమానం ప్రకారం జూన్ 8వ తేదీ సాయంత్రం 6.41 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 9.11 గంటలకు) ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ వ్యోమనౌకలో శుభాంశు రోదసిలోకి దూసుకెళ్లనున్నారు. ఈ యాత్రలో శుక్లా(Shubhanshu Shukla)తోపాటు పెగ్గీ విట్సన్ (అమెరికా), స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ (పోలండ్), టిబర్ కపు (హంగరీ) కూడా వెళ్లనున్నారు. వీరు రెండు వారాల పాటు ఐఎస్ఎస్లో ఉండి పరిశోధనలు చేయనున్నారు.
భారత్ కు చెందిన ఓ వ్యోమగామి అంతరిక్ష కేంద్రానికి వెళ్తుండటం నాలుగు దశాబ్దాల తర్వాత మళ్లీ ఇప్పుడే. 1984లో మన వ్యోమగామి రాకేశ్ శర్మ… రష్యా వ్యోమనౌకలో ఐఎస్ఎస్కు వెళ్లారు. ఇక, తాజాగా శుభాంశు శుక్లా పాల్గొంటున్న మిషన్‌ను అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా, భారత రోదసి పరిశోధన సంస్థ లు సంయుక్తంగా చేపడుతున్నాయి.
రోదసిలో శుభాంశు శుక్లా ఏడు ప్రయోగాల్లో పాల్గొంటారు. అంతరిక్షంలో పంటల సాగు, టార్డిగ్రేడ్ (నీటి ఎలుగుబంటి)ల గురించి అధ్యయనం చేయనున్నారు. ముఖ్యంగా భారతీయ ఆహారంతో ముడిపడిన పంటలపై ప్రయోగాలను చేపట్టడానికి ఇస్రో ప్రణాళికలు సిద్ధంచేసింది. మెంతి, పెసల మొలకలపై పరిశీలన వంటివి ఇందులో ఉంటాయి. వాటిని భూమికి తీసుకొచ్చి… నేలపై ఎలా ఎదుగుతాయన్నది పరిశీలిస్తారు.
Also Read : Pakistan Nationals: పారాదీప్‌కు వచ్చిన నౌకలో 21 మంది పాకిస్తానీలు