MLC Kavitha: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత లేఖ

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత లేఖ

 

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ కు… అతని కుమార్తె, ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఆ లేఖ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. వరంగల్‌ సభ సక్సెస్‌ అయ్యిందంటూనే లేఖ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్‌కు ఆరు పేజీల లేఖలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మై డియర్‌ డాడీ అంటూ కేసీఆర్‌కు రాసిన ఆరు పేజీల లేఖలో వరంగల్‌ సభ సక్సెస్‌ అయ్యిందంటూనే.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎల్కతుర్తి సభ అనంతరం అధినేత కేసీఆర్‌కు కవిత రాసినట్టుగా ఓ లేఖ బయటికొచ్చింది. గతంలో కవిత రాసిన లేఖల్లో ఉన్న దస్తూరితో… ఈ లేఖలోని దస్తూరీ సరిపోలుతోంది. సభ విజయవంతమైనందుకు కేసీఆర్‌ కు అభినందనలు తెలుపుతూ లేఖ రాసిన కవిత… పాజిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ పేరిట 8 అంశాలను ప్రస్తావించారు.

పార్టీ శ్రేణులు పూర్తి ఉత్సాహంతో ఉన్నారని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని వ్యక్తిగతంగా తిట్టకపోవడం చాలా మందికి నచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ గీతం గురించి ప్రస్తావిస్తారని భావించినట్టు తెలిపారు. మొత్తంగా అధినేత నుంచి మరింత పదునైన విమర్శలను పార్టీ శ్రేణులు ఆశించినట్టు పేర్కొన్నారు. ఇదే సమయంలో నెగిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ పేరిట మరికొన్ని అంశాలను ప్రస్తావించారు. వక్ఫ్‌ బిల్లు, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలను ప్రస్తావించలేదని అన్నారు. పాత ఇన్‌ఛార్జిలనే నియమించడంతో… పాత పద్దతిలోనే ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదన్న సమాచారం వచ్చిందని పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీ-ఫామ్‌లు ఇన్‌ఛార్జిల ద్వారా కాకుండా… అధినాయకత్వమే నేరుగా ఇవ్వాలని సూచించారు. సభా వేదికపైకి కేసీఆర్‌ వచ్చే వరకు మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న వారితో మాట్లాడించి ఉంటే బాగుండేదన్నారు. ధూం… ధాం… కార్యకర్తలను ఆకట్టుకోవడంలో విఫలమైందని కవిత తెలిపారు. భాజపాను టార్గెట్‌ చేయాలని వ్యక్తిగతంగా తాను కూడా అనుకున్నానని, వారి బాధితురాలిని కాబట్టి అలా అనుకుని ఉండొచ్చని తెలిపారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ విఫలమైందని, భాజపా ప్రత్యామ్నాయం అవుతుందేమోనన్న ఆలోచనలు శ్రేణుల్లో ఉన్నాయని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా భాజపాకు సహకరించామన్న భావనను ప్రజల్లోకి కాంగ్రెస్‌ బలంగా తీసుకెళ్లిందని చెప్పారు.

 

ఈ పరిస్థితిని అధిగమించేందుకు నిర్ధిష్ట కార్యాచరణ ప్రకటిస్తారని.. లేదా మార్గనిర్దేశనం చేస్తారని అందరూ భావించినట్టు తెలిపారు. జడ్పీ ఛైర్మన్‌, ఎమ్మెల్యే స్థాయి నాయకులు కూడా చాలా మంది మిమ్మల్ని కలవడం లేదని బాధపడుతున్నారని పేర్కొన్న కవిత.. కొంత మందికి మాత్రమే అవకాశం ఉంటుందని భావిస్తున్నారని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండాలని, ఇప్పటికైనా ఒకటి రెండ్రోజుల పాటు పార్టీ ప్లీనరీ నిర్వహించాలని కవిత సూచించారు. ఈ విషయాలపై కాస్త సీరియస్‌గా ఆలోచించాలని తండ్రి కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత కోరారు. సుదీర్ఘంగా లేఖ రాసినందుకు కేసీఆర్‌కు కవిత క్షమాపణలు చెప్పారు.

 

పాజిటీవ్ అంశాలు

 

సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో మీ ప్రసంగంతో క్యాడర్‌లో కొత్త ఉత్సాహం కనిపించింది

మీ ప్రసంగం మొదటి నుంచి చివరి వరకు అందరూ శ్రద్ధగా విన్నారు

‘ఆపరేషన్ కగార్’ గురించి మీరు మాట్లాడిన విధానం అందరికి నచ్చింది

మీరు చెప్పిన ‘కాంగ్రెస్ ఫెయిల్ ఫెయిల్’ అన్న మాట బాగా పాపులర్ అయింది

పహల్గాం బాధితుల కోసం మీరు మౌనం పాటించడంపై అభినందనలు వెల్లువెత్తాయి

రేవంత్ రెడ్డిని మీరు పేరు పెట్టి విమర్శించకపోవడం అందరినీ ఆకట్టుకుంది. రేవంత్ రోజూ మిమ్మల్ని విమర్శిస్తున్నా మీరు గౌరవంగా స్పందించారన్న అభిప్రాయం అందరిలో నెలకొంది.

తెలంగాణ అంటే బీఆర్ఎస్.. తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు మరింత బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారు

తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, రాష్ట్ర గీతంపై మాట్లాడుతారని ఆశించారు

అయినప్పటికీ నాయకులు, క్యాడర్ మాత్రం మీ సభ మీద సంతృప్తిగా ఉన్నారు

పోలీసులను మీరు హెచ్చరించిన మాటలు బాగా గుర్తుండిపోయాయి.

 

నెగిటీవ్‌ అంశాలు 

ఉర్దూలో మాట్లాడకపోవడం.

వక్ఫ్ బిల్లుపై మాట్లాడకపోవడం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ విషయాన్ని ప్రస్తావించలేదు

ఎస్సీ వర్గీకరణపై మాట్లాడలేదు.

పాత ఇన్‌ఛార్జులకు బాధ్యతలు ఇచ్చిన కారణంగా కొన్ని నియోజకవర్గాల్లో సరిగా ఏర్పాట్లు జరగలేకపోయాయి. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన కేడర్‌ను పట్టించుకోలేదు.

పంచాయతీ ఎన్నికల బి-ఫారాల విషయంలో పాత ఇన్‌ఛార్జులకే బి-ఫారాలు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో కొత్త ఆశావహుల మధ్య అసంతృప్తిని కలిగిస్తోంది.

కింది స్థాయి నాయకులు మీతో ఫోటో తీసుకోవాలనే ఉత్సాహాన్ని చూపించారు. కానీ వారికీ ఆ అవకాశం లేకపోవడం మీ దగ్గరకు రాక మానేశారు. కొంతమందికే అనే ఫీలింగ్ ఉంది. దయచేసి అందరికి అవకాశం ఇవ్వండి.

2001 నుండి మీతో ఉన్న సీనియర్ నాయకులకు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదన్న అభిప్రాయం ఉంది.

‘ధూమ్ ధాం’ కార్యక్రమం క్యాడర్‌ను ఆకట్టుకోలేకపోయింది.

బీజేపీపై మీరు రెండు నిమిషాలే మాట్లాడడం వల్ల.. బీజేపీతో బీఆర్‌ఎస్‌ పొత్తు ఉంటుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

కాంగ్రెస్ క్రింద స్థాయిలో ప్రజాభిమానం కోల్పోయింది. కానీ బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందన్న అభిప్రాయం క్యాడర్‌లో ఉంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్లే బీఆర్‌ఎస్.. బీజేపీకి సహకరించిందంటూ కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.

అందరూ ఆశించిన విషయం

ప్రస్తుత రాజకీయాలపై మీరు శ్రేణులకు స్పష్టమైన కార్యక్రమాలు, దిశానిర్ధేశం ఇవ్వాలని అనుకున్నారు.

 

సూచన 

కనీసం ఇప్పటికైనా ఒక ప్లీనరీ నిర్వహించి ఒకటి,రెండు రోజులపాటు క్యాడర్ అభిప్రాయాలు వినాలి. వారికి భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత ఇవ్వాలి. దయచేసి దీన్ని సీరియస్‌గా పరిగణించండి’ అని కేసీఆర్‌కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారంటూ ఆరు పేజీల లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ లేఖపై బీఆర్‌ఎస్‌ లేదంటే, ఎమ్మెల్సీ కవిత అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Leave A Reply

Your Email Id will not be published!