హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్ అయ్యారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. తనపై పరువు నష్టం దావా దాఖలు చేస్తానని, కోర్టుకు ఈడుస్తానని మండిపడ్డారు. ఆదిత్య కన్ స్ట్రక్షన్ కబ్జాకు పాల్పడుతోందని నువ్వే గతంలో లెటర్ రాశావని , ఆ విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. అవే ఆరోపణలతో నేను ధర్నా చేస్తే బద్నాం చేస్తావా అని భగ్గుమన్నారు. తప్పుడు సమాచారంతో ట్విట్టర్ లో వీడియోలు పెడితే ఎలా అని ఫైర్ అయ్యారు కవిత. వాటిని తొలగించక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. అప్పుడు నీ ప్రభుత్వం, నువ్వు దూకి చావాలన్నారు. నిజం మాట్లాడిన వాళ్లనే బద్నాం చేస్తారా అని నిప్పులు చెరిగారు.
మీరు, మీ ప్రభుత్వం గ్రాఫిక్స్ డిజైనర్లా? కంటెంట్ క్రియేటర్లా? అంటూ ఫైర్ అయ్యారు. మూసీ ప్రక్షాళన అనేది ప్రజలకు మంచి జరిగేలా ఉండాలే తప్పా ఇతరులను ఇబ్బంది పెట్టేలా ఉండ కూడదన్నారు. మూసీ ప్రాజెక్ట్ కోసం ప్రపంచ బ్యాంక్ కు రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారని గతంలోనే చెప్పామన్నారు కవిత. మొన్నటి ప్రజెంటేషన్ లో ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తామని చెప్పలేదని అన్నారు. గత ప్రభుత్వంలో మూసీ రివర్ బెడ్ లో నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వలేదని, కానీ ఇప్పుడు ఇవ్వడానికి కారణాలేంటి అని ప్రశ్నించారు. పర్మిషన్ల వెనుక జరిగిన మాయాజాలం ఏంటీ? అని నిలదీశారు. వెలుగుమట్ల బాధితుల విషయంలో 17న ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేస్తామని ప్రకటించారు. వారందరికీ మేలు జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుందని అన్నారు.
