రంగారెడ్డి జిల్లా : హైడ్రా దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్‌లోని రాంబాగ్ సర్వే నంబరు 354/1, 354/2, 354/3లలో 2.34 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. 250 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. చుట్టూ దేవాలయాలు.. మధ్యలో ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమికి ఆనుకుని సిక్కులకు సంబంధించిన సమాధి ఉంది. ఒక వైపు దేవాలయాలకు కేటాయించాలని, మరో వర్గం సిక్కులకు ఇవ్వాలని స్థానికంగా ఎప్పటి నుంచో వివాదం నెలకొని ఉంది. ఎవరికి వారు తమదంటూ వాధిస్తూ వచ్చారు. ఇటీవల సిక్కులు తమకు ఈ భూమిని కేటాయించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ స్థలం విషయంపై సరైన నిర్ణయం తీసుకోవాలని జనవరి నెల 29న జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది.
ఇందుకు గాను 3 నెలల సమయం ఇచ్చింది. ఈ లోగా సిక్కు మతస్తులు 2.34 ఎకరాల చుట్టూ టిన్ షీట్లతో ప్రహరీ నిర్మించి వారి ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో వివాదం తలెత్తింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో మీడియాలో వచ్చిన కథనాలతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇటీవల పరిశీలించారు. ఇరు వర్గాలతో మాట్లాడారు. సంబంధిత పత్రాలను పరిశీలించారు. రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు. ఫెన్సింగ్ వేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు టిన్ షీట్లతో వేసిన ప్రహరీని తొలగించారు. ఆ వెంటనే 2.34 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ వేశారు.
ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా హైడ్రాతో కలసి పోలీసులు, రెవెన్యూ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. సిక్కుల సమాధి ఉన్న స్థలం 366 గజాల స్థలాన్ని వదిలిపెట్టి మిగతా భూమి చుట్టూ ఫెన్సింగ్ శారు. దీంతో అక్కడ సమస్య పరిష్కారమైంది. దశాబ్దాల సమస్యకు హైడ్రా పరిష్కారం చూపడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడిందంటూ కొనియాడారు.