KCR : నేత‌ల ఆశ‌లు ఫ‌లించేనా..ప‌ద‌వులు వ‌రించేనా

KCR : కోరి తెచ్చుకున్న తెలంగాణ‌లో ప‌ద‌వుల పందేరం ఇంకా కొలిక్కి రాలేదు. లెక్క‌కు మించి కార్పొరేష‌న్లు, నామినేటెడ్ ప‌ద‌వులు భ‌ర్తీ కాకుండా మిగిలి పోయాయి. అప్పుడు ఇప్పుడు అంటూ నెట్టుకు వ‌స్తున్న పార్టీ హై క‌మాండ్ కు గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో భ‌ర్తీ చేయక త‌ప్ప‌డం లేదు. నిన్న‌టి దాకా మౌనంగా భ‌రిస్తూ వ‌చ్చిన పార్టీ కోసం ప‌ని చేసిన వారు. న‌మ్ముకున్న కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, అభిమానులు, అనుచ‌రులు పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న‌రు. ఇప్ప‌టికే ఆయా జిల్లాల పార్టీ అధ్య‌క్షుల‌తో ఆశావ‌హులు ట‌చ్ లో ఉంటున్నారు. పార్టీ ఇస్తుంద‌న్న న‌మ్మ‌కంతో భ‌రిస్తూ వ‌చ్చిన వారిలో ఒక్క‌రొక్క‌రు మెల మెల్ల‌గా స్వ‌రం వినిపిస్తున్నారు. దీనికంతటికి కార‌ణం ఇటీవ‌ల ముఖ్య‌మంత్రి సైతం ప‌ద‌వుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

స‌రైన టైంలో స‌రైన వ్య‌క్తుల‌కు స‌ముచిత స్థానాలు ల‌భిస్తాయ‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే స‌చివాల‌యం కూల్చ‌డంతో ఆయా ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌లో మంత్రులు, విప్‌లు, ఛైర్మ‌న్లు, స‌భ్యుల‌కు స‌ర్దుబాటు చేశారు. అయినా ఇంకా భ‌ర్తీ చేయాల్సిన పోస్టులు మాత్రం మిగిలే ఉన్నాయి. దీంతో అన్ని జిల్లాల నుంచి వ‌త్తిళ్లు పెరిగాయి. ఆయా జిల్లాల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు సైతం త‌ల‌నొప్పులు త‌ప్ప‌డం లేదు. నిన్న‌టి దాకా ఉప ఎన్నిక‌లు, కార్పొరేష‌న్ ఎన్నిక‌లంటూ దాట వేస్తూ వ‌చ్చిన పార్టీ పెద్ద‌ల‌కు ఇపుడు భ‌ర్తీ చేయ‌డం అన్న‌ది త‌ప్ప‌నిస‌రిగా మారింది. దుబ్బాక ఉప ఎన్నిక‌కు ముందు ఏది చెప్పినా న‌డిచేది. ప్ర‌స్తుతం అక్క‌డ జ‌నం తిర‌స్క‌రించ‌డం, హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల్లో పార్టీకి కోలుకోలేని షాక్ ఇవ్వ‌డంతో హై క‌మాండ్ పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్లు స‌మాచారం. అసంతృప్తుల‌ను బుజ్జ‌గిస్తూ వ‌స్తోంది.
త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే వ‌రంగ‌ల్, ఖ‌మ్మం కార్పొరేష‌న్ల ఎన్నిక‌ల‌తో పాటు నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక కూడా ఉండ‌డంతో వీటిని పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఎట్టి ప‌రిస్థితుల్లో గులాబీ జెండా ఎగుర వేయాల‌ని కృత నిశ్చ‌యంతో ఉంది. స‌ర్వ శ‌క్తుల‌ను కేంద్రీక‌రించి గెలుపు సాధించాల‌ని పార్టీ శ్రేణుల‌ను అధినేత ఆదేశించారు. ఇదే క్ర‌మంలో నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీ ప్ర‌క్రియ మ‌రికొంత ఆల‌శ్యం అయ్యేలా అగుపిస్తోంది. కాగా కొన్ని కార్పొరేష‌న్ల‌కు ఛైర్మ‌న్లతో పాటు మెంబ‌ర్లు, డైరెక్ట‌ర్ల‌ను భ‌ర్తీ చేసింది. ఇంకా చేయాల్సిన‌వి చాలా ఉన్నాయి. జిల్లా స్థాయిల‌లో కొంద‌రి ప‌నితీరు బాగా లేక పోతే ఆయా జిల్లాల‌లో ఆశిస్తున్న వారిలో స‌మ‌ర్థుల‌ను ఎంపిక చేసే అవ‌కాశం లేక పోలేదు.

తెలంగాణ రాష్ట్రంలో స‌మాచార హ‌క్కు చ‌ట్టంలో ఇంకా కొంద‌రిని నియ‌మించాల్సి ఉంది. సెట్విన్, టూరిజం కార్పొరేష‌న్, విక‌లాంగుల ప‌రిర‌క్ష‌ణ సంస్థ‌, విశ్వ బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్, తెలంగాణ ప్రెస్ అకాడెమీ, తెలంగాణ నాట‌క అకాడెమీ, తెలుగు యూనివ‌ర్శిటీ మెంబ‌ర్ల‌ను నింపాల్సి ఉన్న‌ది. వీటితో పాటు నీటి పారుద‌ల సంస్థ‌, రెడ్ క్రాస్ సొసైటీ , గ్రంథాల‌య సంస్థ‌ల ఛైర్మ‌న్లు, ఇండ‌స్ట్రియ‌ల్ కార్పొరేష‌న్ స‌భ్యులు, తెలంగాణ సెన్సార్ బోర్డు మెంబ‌ర్లు, రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ రీజిన‌ల్ మెంబ‌ర్లు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజిన‌ల్ మెంబ‌ర్లు, దేవాదాయ ధ‌ర్మాదాయ సంస్థ‌, ధార్మిక ప‌రిషత్తు, ఖాదీ విలేజ్ ఇండ‌స్ట్రీస్ కార్పొరేష‌న్, మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్, తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఛైర్మ‌న్, స‌భ్యుల భ‌ర్తీ, సాంఘిక సంక్షేమ గురుకులాల సంస్థ‌, బీసీ గురుకులాల సంస్థ‌, బేవ‌ర్జీస్ కార్పొరేషన్ ల‌లో నామినేటెడ్ ప‌ద‌వులు ఖాళీగా ఉన్నాయి.

ఇక తెలంగాణ విత్త‌నాభివృద్ధి సంస్థ‌, ఆచార్య జ‌య‌శంక‌ర్ విశ్వ విద్యాల‌యం బోర్డు మెంబ‌ర్లు, హాకా, మార్్క ఫెడ్, స్త్రీ నిధి బ్యాంకు డైరెక్ట‌ర్లు, తెలంగాణ పేద‌రిక నిర్మూల‌న సంస్థ‌, జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ( అపార్డ్), బాల కార్మిక నిర్మూల‌న సంస్థ‌, జైళ్ల శాఖ కార్పొరేష‌న్, తెలంగాణ పోలీస్ అకాడెమీ, తెలంగాణ రాష్ట్ర వినియోగ‌దారుల హ‌క్కుల సంస్థ‌, ఎంబీసీ కార్పొరేష‌న్ మెంబ‌ర్లు, ఓవ‌ర్సీస్ మ్యాన్ ప‌వ‌ర్ కార్పొరేష‌న్, టి వ‌ర్క్ ఫౌండేష‌న్, సంప్ర‌దాయేత‌ర ఇంధ‌న వ‌న‌రుల సంస్థ‌, ట్రాన్స్ కో, జెన్ కో, ఆయా దేవాల‌యాల పాల‌క మండ‌ళ్లు, మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్, ఇండ‌స్ట్రియ‌ల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్, ప‌ట్ట‌ణ పేద‌రిక నిర్మూల‌న సంస్థ‌, టిశాక్ష్‌, యాద‌గిరి ఛాన‌ల్ డైరెక్ట‌ర్ ల‌లో ప‌ద‌వులు ఖాళీగా ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే భ‌ర్తీ కావాల్సిన‌వి మిగిలి ఉన్నాయి.

No comment allowed please