తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడే జమిలి ఎన్నికలు వస్తున్నాయన్నభ్రమ కలుగుతోంది. ఆయా పార్టీలకు చెందిన పేరొందిన నాయకులు మాటలతో మంటలు రాజేస్తున్నారు. ఎవరు ఎప్పుడు ఎలాంటి సంచలనాత్మకం అవుతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. నిన్నటి దాకా స్తబ్దుగా ఉన్న పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. తాజాగా దుబ్బాక, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కమలం తన ప్రతాపాన్ని చూపించడంతో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు సుదీర్ఘ రాజకీయ వారసత్వం..చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. అనూహ్యంగా బండి సంజయ్ చీఫ్ గా పదవీ బాధ్యతలు స్వీకరించాక బీజేపీ దౌడ్ తీస్తోంది. పవర్ లోనున్న పార్టీకి నిద్ర లేకుండా చేస్తోంది.
అన్ని పార్టీలకు చెందిన ప్రధాన నేతలను రా రమ్మంటూ ఆహ్వానం పలుకుతోంది.
రాబోయే ఉప ఎన్నికలతో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని బీజేపీ జెండా ఎగుర వేయాలన్న సంకల్పంతో ముందుకు కదులుతోంది. ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఆయా ప్రాంతాలకు ఇంఛార్జ్‌లను కూడా నియమించింది. ఎలాగైనా సరే విజయం దక్కించు కోవాలనే దిశగా అడుగులు వేస్తోంది. దుబ్బాకలో డిపాజిట్ కోల్పోయి చతికిల పడిన కాంగ్రెస్ పార్టీ జిహెచ్ంఎసీ ఎన్నికల్లో రెండు సీట్లు గెలుచుకుని పరువు దక్కించుకుంది. ఇదే క్రమంలో సిటీలో పలువురు పట్టు కలిగిన నేతలు కమలం వైపు చూస్తుండడంతో నష్ట నివారణ చర్యలకు దిగుతోంది హైకమాండ్.
అయినా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఆ పార్టీ నేతలు నువ్వా నేనా అన్న రీతిలో పీసీసీ పదవి కోసం పాకులాడుతున్నారు. ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ తమకే పదవి దక్కాలని ప్రయత్నాలు ప్రారంభించారు. నల్లగొండ జిల్లాలో రాజకీయంగా మంచి పట్టు కలిగి..ప్రజాభిమానం మెండుగా ఉన్న నేతలుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పేరుంది. తమ్ముడు గత ఎన్నికల్లో ఎంపీగా గెలిస్తే..అన్న ఎమ్మెల్యేగా ఉన్నారు. పీసీసీ చీఫ్ రేసు లో రేవంత్ రెడ్డిని తమ్ముడు ఢీకొంటున్నాడు. ఇదే సమయంలో గతంలో తెలంగాణలో బీజేపీ గాలి వీసే అవకాశం ఉందంటూ రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశారు.
తాజాగా తిరుమలను దర్శించుకున్న ఆయన ఇపుడు కమలం వికసిస్తోందని..తాను త్వరలో చేరే అవకాశం ఉందంటూ బాంబు పేల్చారు. దీంతో కాంగ్రెస్ లో ఈ కామెంట్ కలకలం సృష్టిస్తే కమల దళంలో హర్షం వ్యక్తమవుతోంది. ఇక గులాబీ దళం ఏం జరుగుతోందంటూ వేచి చూస్తోంది. మొత్తంగా చూస్తే తమ్ముడు కాంగ్రెస్ లో ..అన్న బీజేపీలోకి వెళితే ఎలా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. పవర్ పాలిటిక్స్ ఇలాగే ఉంటాయన్న వాస్తవం ప్రజలకు తెలిస్తే కదా. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ లో ఎవరుంటారు..ఎవరు మిగులుతారనే ప్రశ్న ఆ పార్టీ నేతల్లో కలుగుతోంది.
No comment allowed please