#NaziaHaasanSinger : లోకాన్ని వీడని గాత్ర మాధుర్యం
ఈ ప్రపంచానికి దేవుడిచ్చిన వరం గాత్రధారులే. దేవుళ్లు ఉన్నారో ..అమృతం తాగారో లేదో తెలియదు కానీ..ఈ భూలోకం మీద కనిపించే దేవుళ్లు కళాకారులే. వాళ్లు సృజనశీలురు. వాళ్లు దిశా నిర్దేశం చేసే చోదక శక్తులు. వారితో మనం గడపక పోవచ్చు..కానీ మనతో పాటు వారి నైపుణ్యంతో ..అసాధారణమైన ప్రతిభతో మనల్ని దిగంతాలకు తీసుకెళతారు.
పిల్లగాలి సోకితే ఎలా వుంటుంది. గుండెల్ని పిండేసేలా స్వర మాధుర్యం మనల్ని వెంటాడితే ఏమవుతుంది. నిద్ర పోయినా కలవరించేలా పాట వెంటాడుతుంటే ..ఇంకెలా మరిచి పోగలం..వినమ్రంగా స్వీకరించడమే తప్ప. నిరాశలో మునిగి పోయినప్పుడు..మనకంటే ఎక్కువగా ప్రేమించిన మనసులు దూరమైనప్పుడు ..ఏకాంతంలో ఒక్కళ్లమే నిశీధిలోకి కిటికీ చాటుగా తొంగి చూస్తున్నప్పుడు ..మెల్లగా మొదలై ఆ గాత్ర మాధుర్యం అల్లుకుపోతుంది. ఎప్పటిలాగే మనల్ని వివశత్వంలోకి తీసుకెళుతుంది. ఈ ప్రపంచానికి దేవుడిచ్చిన వరం గాత్రధారులే. దేవుళ్లు ఉన్నారో ..అమృతం తాగారో లేదో తెలియదు కానీ..ఈ భూలోకం మీద కనిపించే దేవుళ్లు కళాకారులే. వాళ్లు సృజనశీలురు. వాళ్లు దిశా నిర్దేశం చేసే చోదక శక్తులు. వారితో మనం గడపక పోవచ్చు..కానీ మనతో పాటు వారి నైపుణ్యంతో ..అసాధారణమైన ప్రతిభతో మనల్ని దిగంతాలకు తీసుకెళతారు.
మేల్కొన్న కళ్లను మూసి వుంచేలా చేస్తారు. చల్లని పైరగాలులు వీస్తుంటే పిల్ల తెమ్మరలు యెదను తడుము తుంటే ..తుంటరి పాటలే కాదు నిద్రలోకి జారుకునేలా చేసే పాటలు..గేయాలు ఎన్నెన్నో..అందులో గజళ్లు కూడా..ఇరు దేశాల మధ్య ఎన్నో మనస్పర్తలు..కానీ కళ వరకు వచ్చేసరికల్లా అంతా ఒక్కటే. ఈ నేల మీద ఓ పిల్ల తెమ్మెర తన గాత్రదానంతో అద్వితీయమైన సంతకాన్ని వదిలి వెళ్లింది. ఆమె ఎవరో కాదు పాకిస్తాన్ కు చెందిన నజియా హసన్. ఫిరోజ్ ఖాన్ …ఠీవీగా నడిచి వస్తుంటే..ఈ సాహెబుల అమ్మాయి ..ఆప్ జైసా కోయీ ..అంటూ పాడితే కోట్లాది సినీ లోకం కుల,మతాలకు అతీతంగా ఫిదా అయ్యారు. తమలో ఆమెను చూసుకున్నారు. ఎంతలా అంటే ప్రేమించేంత దాకా..తమలోకి చేర్చుకునేంత దాకా..బతికింది కొన్నేళ్లే..కానీ పది కాలాల పాటు తన జ్ఞాపకాలను మనకు మిగిల్చింది. తను ఆ స్వర్గంలో పాడుతూనే ఉన్నది.
ఒక్కసారి వింటే చాలు..ఆ మంద్ర స్వర విన్యాసం మనల్ని కట్టి పడేస్తుంది..గుండెను పిండేస్తుంది. పాకిస్తాన్ లో 1965లో పుట్టిన ఈ గాన కోకిల..పాటగత్తెనే కాదు లాయర్ కూడా..అంతకంటే సామాజిక కార్యకర్త. పదేళ్ల వయస్సులో పాడటం స్టార్ట్ చేసింది. అనతి కాలంలోనే ఆసియా ఖండంలో పేరెన్నికగన్న గాయకుల సరసన చేరింది. స్వర ప్రేమికులంతా ఆమెను ముద్దుగా క్వీన్ ఆఫ్ పాప్ గా పిలుచుకుంటారు. తన బ్రదర్ జోహెబ్ హసన్ తో కలిసి కచేరీలు, స్టేజ్ షోలు లెక్కలేనన్ని చేసింది. నజియా గాత్రానికి ముగ్ధులైన సినీ లోకం ఆమెకు ఛాన్స్ ఇచ్చారు. ఇంకేముంది బాలీవుడ్ ఒక్కసారిగా షేక్ గురైంది. హొయలు పోతూ డిస్కో దివానే అంటూ పాడిన పాట ఆనాడే 65 మిలియన్ల రికార్డులను తిరగ రాసింది. బ్రిటిష్ చార్ట్స్ లో మొదటి పాకిస్తానీ గాయనిగా చోటు దక్కించుకుంది.
అమెరికన్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ లండన్ లో ఎకనమిక్స్, లా లో డిగ్రీలు పొందింది. 1980లో వచ్చిన కుర్బానీ సినిమాతో నజియా హసన్ హవాకు అడ్డు లేకుండా పోయింది. పాప్ సింగర్ గా వినుతికెక్కింది. ఆ తర్వాత స్వంతంగా ఆల్బమ్స్ చేసింది. బూమ్ బూమ్ , యంగ్ తరంగ్, హాట్ లైన్ దుమ్ము రేపాయి. ఆఖరుగా కెమెరా కెమెరా ఆల్బం చేసింది. ఈ ఆల్బం మాదక ద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా పాటలు కట్టింది. ఎన్నో టీవీ ప్రోగ్రామ్స్ చేసింది…పాల్గొంది కూడా. సోహెల్ రాణాతో కలిసి సంగ్ సంగ్ పేరుతో మ్యూజిక్ షో కు ఎనలేని ఆదరణ దక్కింది. పాకిస్తాన్ పాప్ మ్యూజిక్ రంగంలో సునామీలా దూసుకు వచ్చింది. 15 ఏళ్ల పాటు ఈ గాత్ర సంచారం సాగింది. పాకిస్తాన్ లో మోస్ట్ పాపులర్ సింగర్ గా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ప్రపంచాన్ని ఈ పిల్ల తెమ్మర ఊపేసింది.
తక్కువ వయసులో ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. యునిసెఫ్ కల్చరల్ అంబాసిడర్ గా నజియా హసన్ ను నియమించింది. అలుపు లేకుండా పాడుతూనే ఉన్న ఈ గాన కోకిలను క్యాన్సర్ కాటేసింది. బిడ్డుతో కలిసి పాప్ ఆల్బమ్స్ రిలీజ్ చేసింది. వీటికి విపరీతమైన పాపులారిటీ వచ్చింది.
డిస్కో దివానే ఆల్బం పాకిస్తాన్, ఇండియాతో పాటు ప్రపంచాన్ని ఊపేసింది. వెస్టిండీస్, లాటిన్ అమెరికాతో పాటు అమెరికా, రష్యాలో కూడా నజియా హసన్ పాటలకు జై కొట్టారు. ఆమెకు సినిమాల్లో నటించమని ఆఫర్లు కూడా వచ్చాయి. ఆమె వాటిని సున్నితంగా తిరస్కరించారు. పాడేందుకే ప్రయారిటీ ఇచ్చారు. లండన్ లో ఫేమస్ సింగర్స్ డేవిడ్ రోజ్, కాతే రోజ్ తో కలిసి ఆల్బం చేసింది. ఆంఖే మిలానే వాలే అనే సాంగ్ ఇప్పటికీ జనాన్ని ఉర్రూతలూగిస్తోంది. చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. లెక్కలేనన్ని అవార్డులు..పురస్కారాలు ఆమెను వరించాయి.
కోట్లాది మందిని తన స్వరంతో సేద దీర్చిన దీపదారి ఇక సెలవంటూ 13 ఆగష్టు 2000లో లండన్‌లో తనువు చాలించింది. ఆమె ఈ భువిపై బతికింది కేవలం 35 ఏళ్లు మాత్రమే. ఆ స్వరం పలకరించకుండా ఏళ్లవుతున్నా..ఇప్పటికీ ఆప్ జైసే కోయీ అంటూ అభిమానులను పలకరిస్తూనే ఉన్నది..పలవరించేలా..కన్నీళ్లు పెట్టుకునేలా చేస్తూనే ఉన్నది..ఇప్పటికీ కళాభిమానులు నిత్యం ఆమె సమాధి ముందు పూలు చల్లుతూనే ఉంటారు. నేను లేక పోయినా నా పాట మిగిలే ఉందంటోంది..నజియా హసన్ .. ఈ పిల్ల తెమ్మర ఇపుడు దిగంతాలనే కాదు ఈ భువిని పావనం చేస్తోంది. ఆ స్వర సమ్మేళనం ధూపమై అల్లుకు పోయింది..దుఖఃంతో వీడ్కోలు పలకడం తప్ప.
No comment allowed please