#CovidEffect : భ‌రోసా ఇవ్వ‌ని కంపెనీలు ఆందోళ‌న‌లో ఉద్యోగులు

పింక్ స్లిప్పులు రెడీ చేస్తున్న కంపెనీలు

Covid Effect: నిన్నటి దాకా బీరాలు పలికిన కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి చేతులెత్తేయడంతో దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఆయా కంపెనీలు, స్టార్ట్ అప్ లు పొదుపు మంత్రం జపిస్తున్నాయి. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు నష్టాలను అదుపులో ఉంచుకునేందుకు గాను ఇప్పటి నుంచే కాస్ట్ కట్టింగ్ అమలు చేస్తున్నాయి. దీంతో భారీ ఎత్తున ఉద్యోగాలకు కొత్త పెడుతున్నాయి. ఇంకో వైపు ఎంతో ఆర్భాటంగా స్టార్ట్ చేసిన పలు స్టార్టప్‌ కంపెనీలు మూత పడుతుండగా, మరో వైపు కార్పొరేట్, ఐటీ కంపెనీలు మనుగడ కోసం ఉద్యోగుల సంఖ్యను కత్తిరిస్తున్నాయి.

వాటిల్లో శ్యామ్‌సంగ్‌ ఇండియా లాంటి దిగ్గజ ఎలక్ట్రానిక్‌ కంపెనీల నుంచి పేటీఎం లాంటి డిజటల్‌ కంపెనీ, అనతి కాలంలోనే అనూహ్యంగా విస్తరించిన హోటల్‌ నెట్‌వర్కింగ్‌ కంపెనీ ‘ఓయో’ వరకు ఉన్నాయి. రిటేల్‌ దిగ్గజ సంస్థ వాల్‌మార్ట్‌ ఇండియా గురుగావ్‌లోని తన ప్రధాన కార్యాలయంలో 56 మంది టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లను(Covid Effect) వదులుకొంది. వారిలో ఎనిమిది మంది సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయిలో ఉండగా, మిగతా 48 మంది మధ్య, దిగువ మేనేజ్‌మెంట్‌ క్యాడర్‌కు చెందిన వారున్నారు. శ్యామ్‌సంగ్‌ ఇండియా 150 మంది ఉద్యోగులను ఇంటికి పంపించినట్టు సమాచారం .

యాజమాన్యం ఒత్తిడికి తగ్గి కంపెనీ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ రంజీవ్‌జిత్‌ సింగ్, బిజినెస్‌ హెడ్‌ సుఖేశ్‌ జైన్‌లు తమ పదవులకు రాజీనామా చేశారు. అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను అనుగుణంగా ఎప్పటికప్పుడు సిబ్బందిని సర్దుబాటు చేసుకుంటూ సుదీర్ఘ కాలం పాటు పోటీలో నిలబడాలంటే ఇలాంటి తప్పవని యాజమాన్యం తెలిపింది. ఓయో కంపెనీ దేశ వ్యాప్తంగా 2,400 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సీఎన్‌ఎన్‌ వెల్లడించింది. బిజినెస్‌ అంచనాలకు తగ్గట్టుగా ఒకరు చేసిన పనినే మరొకరు చేసే డూప్లికేట్‌ పద్ధతిని తొలగించి, పని సామర్థ్యాన్ని పెంచడం కోసం ఇలాంటి చర్యలు అనివార్యం అవుతున్నట్లు కంపెనీ సీఈవో రితేష్‌ అగర్వాల్ ఉద్యోగులను ఉద్దేశించి రాసిన ఓ లేఖలో పేర్కొన్నారు.

ఐటీ సర్వీసెస్ అందిస్తున్న అమెరికా కేంద్రంగా భారత్‌లో పనిచేస్తున్న కాగ్నిజెంట్ సంస్థ నుంచి 350 మంది ఉద్యోగులను తొలగించనుందని ‘ది ఎకనామిక్‌ టైమ్స్‌’ తెలియ జేసింది. ఏడాదికి 80 లక్షల నుంచి 1.2 కోట్ల రూపాయల ప్యాకేజీ అందుకునే ఉద్యోగులే ఎక్కువ మంది బాధితులవుతారని తెల్సింది. వాస్తవానికి ఈ కంపెనీ గత నవంబర్‌ నెలలోనే ఖర్చు నియంత్రణలో భాగంగా రానున్న కొన్ని నెలల్లో  ఏడు వేల మంది ఉద్యోగులను(Covid Effect) తొలగిస్తామని ప్రకటించింది.

అద్దెకు క్యాబ్‌లను నడిపే ఓలా సంస్థ గత నెలలోనే 500 మంది ఉద్యోగులపై వేటు వేసినట్లు, అందుకు భారత ఆర్థిక మాంద్యమే కారణమని ‘ఎన్‌ట్రాకర్‌ వెబ్‌సైట్‌’ వెల్లడించింది. నష్టాలను తగ్గించు కోవడంలో భాగంగా రానున్న నెలల్లో మరి కొంత మందిని తీసేయనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. తమ వద్ద 4,500 మంది ఉద్యోగులు(Covid Effect) పని చేస్తున్నారని, వారిలో ఐదు నుంచి ఏడు శాతం మందినే తొలగించనున్నట్టు యాజమాన్యం స్పష్టం చేసింది.

డిజిటల్‌ చెల్లింపుల సంస్థ గత నెలలో 500 మంది మధ్య, జూనియర్‌ స్థాయి ఉద్యోగులను వెళ్లిపోవాల్సిందిగా పేటీఎం యాజమాన్యం కోరినట్లు తెలిపింది. ఇక బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న పలు సేవల సంస్థ క్వికర్  గత డిసెంబర్‌ నెలలో రెండు వేల మంది ఉద్యోగులను తొలగించినట్లు ‘ఐఏఎన్‌ఎస్‌’ వార్తా సంస్థ వెల్లడించింది. కార్మిక శక్తి హేతుబద్ధీకరణలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు కంపెనీ యాజమాన్యం వెల్లడించింది. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దేశంలో నిరుద్యోగం పెరిగిన నేపథ్యం ఈ కోతలు కార్మికులకు కడుపుకోత కానున్నాయి.

No comment allowed please