#GoutamSawang : విద్వేషకారులకు గౌతం సావంగ్ వార్నింగ్
నేరాలకు పాల్పడితే పీడీ యాక్టు
Goutam Sawang : ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చ గొట్టాలని ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధప్రదేశ్ డీజీపీ గౌతం సావంగ్ హెచ్చరించారు. దేవాలయాలపై సామాజిక, ప్రచార మాధ్యమాలలో తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ అల్లర్లు సృష్టించాలని చేస్తున్నారని వారిని గుర్తించి కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అంతే కాకుండా తప్పుడు వార్తలు ప్రసారం చేసినా చర్యలు తప్పవన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఆలయానికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని డీజీపీ వెల్లడించారు.
ఇప్పటికే 58 వేల 871 ఆలయాలకు జియో ట్యాగింగ్ ను జత చేయడం జరిగిందని, ఎవరు ఏం చేస్తున్నారనే దానిపై క్షణాల్లో తమకు చేరుతుందని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు సావంగ్. తాము తీసుకున్నచర్యలపై ఇతర రాష్ట్రాలు సైతం ప్రశంసిస్తున్నాయని డీజీపీ చెప్పారు. అంతే కాకుండా 45 వేల 824 సీసీ కెమెరాలను అమర్చామని, నిరంతరం నిఘా ఏర్పాటు చేశామన్నారు. కొందరు కావాలని రాష్ట్రంలో ఆలయాలు ఆపదలో ఉన్నాయంటూ దుష్ప్రచారం చేస్తూ, ఉద్రిక్తతలు రేకెత్తించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
పోలీసులు ఏ మాత్రం పట్టించు కోవడం లేదంటూ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఇదిలా ఉండగా కులం, మతం పేరుతో తమపై వ్యాఖ్యాలు చేయడాన్ని తన 35 ఏళ్ల సర్వీసులో చూడలేదన్నారు. కులమతాలకు అతీతంగా రాజ్యాంగానికి లోబడి పని చేస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ మూలలో చిన్న సంఘటన జరిగినా తమకు తెలిసి పోతుందని, జాగ్రత్తగా ఉండక పోతే విలువైన జీవితంపై మచ్చ పడుతుందని సూచించారు.
ప్రాపర్టీ అఫెన్స్ కు సంబంధించి 180 కేసులను ఛేదించి 337 మంది నేరస్తులను అరెస్ట్ చేశామన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే పీడీ యాక్టు ప్రయోగిస్తామన్నారు. గ్రామ స్థాయిలో ఇప్పటి దాకా 15 వేల 394 రక్షణ దళాలను నియమించామని, మరో 7 వేల 862 దళాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు కనిపిస్తే వెంటనే 9392903400 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని డీజీపీ కోరారు.
No comment allowed please