Tirumala : తిరుమలలో స్వామి, అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఎక్కడ చూసినా గోవిందా గోవిందా నామ స్మరణ వినిపిస్తోంది. ఆ దేవ దేవుడి కటాక్షాల కోసం భక్తులు వేచి చూశారు. పండుగ కావడంతో మరింత ఎక్కువ మంది ఇక్కడికి వచ్చారు. వీరితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రి సత్యవతి రాథోడ్, ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్ బాబు, నటి మంచు లక్ష్మి, నిర్మాత రాకేష్ రెడ్డి శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
వారు తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రతి ఒక్కరికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు మోహన్‌బాబు. భోగిలో కోవిడ్ భస్మమై పోయిందని వ్యాఖ్యానించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతి రహిత పాలన కొనసాగుతోందన్నారు. రాను రాను భక్తుల రద్దీ కొనసాగతోంది. ఇప్పటి వరకు 40 వేల మందికి పైగా తిరుమలను దర్శించుకున్నారు. 14 వేల కు పైగా తలనీలాలు సమర్పించుకున్నారు. తిరుమల హుండీ ఆదాయం 2 కోట్ల 63 లక్షలు వచ్చిందని టీటీడీ ఉన్నతాధికారులు వెల్లడించారు.
గత కొన్ని రోజులుగా నిర్వహిస్తూ వస్తున్న ధనుర్మాస పూజలు పూర్తి కానున్నాయి. రేపటి నుంచి యధావిధిగా శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ పునః ప్రారంభం కానుంది. గోదాదేవి పరిణయోత్సవాలు, పార్వేతి ఉత్సవం జరగనుంది. కరోనా వ్యాధి ఉన్నప్పటికీ భక్తుల తాకిడి ఇంకా పెరుగుతూనే ఉన్నది. టీటీడీ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసింది టీటీడీ.
No comment allowed please