Satyavati Rathod : భారతీయ జనతా పార్టీ నాయకులు పగతి వేషగాళ్లుగా ప్రవర్తిస్తున్నారంటూ మంత్రి సత్యవతి రాథోడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తన కుటుంబీకులతో కలిసి తిరుమలను సందర్శించారు. శ్రీవేంకటేశ్వర స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు స్థాయికి మించి సోయి తప్పి మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. రాజకీయాలను తలా తోకా లేని నాయకులు భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు.
విలువలకు తిలోదకాలిచ్చి ఇష్టం వచ్చినట్లు, ఎవరిని పడితే వారిని హద్దులు దాటి మాట్లాడుతున్నారని, ఇది తెలంగాణ సంస్కృతిని కించ పరిచేలా ఉందన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవానికి భంగం కలిగేలా కామెంట్లు చేయడం వారికే చెల్లిందన్నారు. బీజేపీ నాయకుల తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మానసిక స్థితి సరిగా లేనట్టు అనుమానం వస్తోందని సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సందేహం నివృత్తి కావాలంటే ఆయన తక్షణమే పరీక్ష చేసుకోవాలని సూచించారు.
ఇప్పటికైనా బీజేపీ నాయకులు తమ తీరును మార్చు కోవాలని లేకపోతే రాబోయే రోజుల్లో పుట్టగతులు ఉండవని సత్యవతి హెచ్చరించారు. కేసీఆర్ పోరాటం చేయక పోతే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేదా అని ఆమె ప్రశ్నించారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాష్ట్రం పట్ల ఒక విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ అని, ఈ రోజు వరకు బీజేపీ నేతలు వ్యక్తిగత విమర్శలు తప్ప ఏ ఒక్క పని చేసిన పాపాన పోలేదన్నారు.
No comment allowed please