UP Elections 2022 : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు (UP Elections 2022)సంబంధించి నాలుగో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ఆయా నియోజకవర్గాలలో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించు కునేందుకు బారులు తీరారు.
దేశంలోనే అత్యధిక శాసనసభ నియోజకవర్గాలు కలిగిన రాష్ట్రంగా యూపీ గుర్తింపు పొందింది. జాతీయ ఎన్నికల సంఘం మొత్తం ఏడు విడతలుగా ఎన్నికలు నిర్వహించనుంది.
ఇప్పటి వరకు మూడు విడతల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇప్పటి దాకా గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో పోలింగ్ పూర్తయింది. ప్రస్తుతం యూపీలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది.
గతంలో 2017లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించి పవర్ లోకి వచ్చింది యోగి ప్రభుత్వం. కానీ ప్రస్తుతం ప్రధాన పోటీ బీజేపీ, సమాజ్ వాది పార్టీ మధ్యే ఉంది.
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఎంఐఎంతో పాటు పలు పార్టీలు బరిలో ఉన్నా రెండు పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఇక నాలుగో విడత పోలింగ్ విషయానికి వస్తే 624 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు.
ప్రస్తుతానికి బందా, ఫతే పూర్ , హర్దోయ్ , లఖింపూర్ ఖేరీ, లక్నో, రాయ్ బరేలీ, సీతా పూర్, పిలిభిత్ , ఉన్నావ్ జిల్లాల్లో పోలింగ్ కొనసాగుతోంది. రాయ్ బరేలీ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది.
ఇక్కడి నుంచే ఎంపీగా సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో 167 మందిపై నేరానికి సంబంధించిన కేసులు ఉన్నాయి.
అందరి ఫోకస్ యూపీ పైనే ఉంది. బీజేపీ తమ పనితీరుకు రెఫరెండమ్ గా భావిస్తోంది.
Also Read : పీకే వ్యవహారం టీఎంసీ ఆగ్రహం