CEC : పార‌ద‌ర్శ‌కంగా ఓట్ల లెక్కింపు

ఈసీ ఏ పార్టీకి కొమ్ము కాయ‌దు

CEC : కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ సుశీల్ చంద్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీఈసీ(CEC) ఏ పార్టీకి తొత్తుగా వ్య‌వ‌హ‌రించ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. పూర్తి పార‌ద‌ర్శ‌కంగా ఐదు రాష్ట్రాల‌కు సంబంధించి ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు.

ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఆయ‌న ప‌లు అంశాల‌పై క్లారిటీ ఇచ్చారు. ఈ ఓట్ల లెక్కింపున‌కు సంబంధించి భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశామ‌న్నారు.

ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా ఉండేందుకు 144 సెక్ష‌న్ విధించార‌ని తెలిపారు. ఈ ఎన్నిక‌ల కోసం 31 వేల కొత్త‌గా పోలింగ్ బూత్ ల‌ను ఏర్పాటు చేశామ‌ని వెల్ల‌డించారు.

కేవ‌లం మ‌హిళ‌ల కోసం 1,900 పోలింగ్ బూత్ లు క‌ల్పించామ‌న్నార‌. దీంతో పెద్ద ఎత్తున మ‌హిళ‌లు త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకున్నార‌ని తెలిపారు.

5 రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు జ‌రిగితే ఇందులో నాలుగు రాష్ట్రాల‌లో అత్య‌ధికంగా మ‌హిళ‌లు ఓటు వేశార‌ని చెప్పారు. ఇదే స‌మ‌యంలో ఈవీఎం ట్యాంప‌రింగ్ ఆరోప‌ణ‌ల‌పై కూడా సీఇసీ స్పందించారు.

రాజ‌కీయ పార్టీల స‌మ‌క్షంలో ఈవీఎంల‌కు సీల్ వేశామ‌న్నారు. తాము ఏ ఒక్క పార్టీకి కొమ్ము కాయ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు.

ఆయా పార్టీలు లేవ‌నెత్తిన ప్ర‌శ్న‌ల‌కు తాము పూర్తి స్థాయిలో స‌మాధానం ఇచ్చామ‌న్నారు. ఎక్క‌డా పొర‌పాట్లు జ‌ర‌గ‌లేద‌న్నారు సుశీల్ చంద్ర‌.

త‌మ సంఘం దృష్టిలో ప్ర‌తి రాజ‌కీయ పార్టీ స‌మాన‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. 5 రాష్ట్రాల‌లో క‌రోనా రూల్స్ ఉల్లంఘించిన వారిపై 2 వేల 270 కేసులు న‌మోదు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

ఈ ఎన్నిక‌ల్లో మొత్తం 6 వేల 900 మంది అభ్య‌ర్థులు పోటీ చేశార‌ని వీరిలో 1,600 కంటే ఎక్కువ మంది నేర చ‌రిత్ర క‌లిగిన వారు ఉన్నార‌ని సీఈసీ(CEC) సుశీల్ చంద్ర వెల్ల‌డించారు.

Also Read : ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఉత్కంఠ

Leave A Reply

Your Email Id will not be published!