Mallu Swarajyam : ధీశాలి మ‌ల్లు స్వ‌రాజ్యం ఇక లేరు

జీవిత‌మంతా పోరాడిన దిగ్గ‌జ ధీశాలి

Mallu Swarajyam : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మ‌ల్లు స్వ‌రాజ్యం ఇవాళ క‌న్ను మూశారు. తుపాకి ప‌ట్టుకున్న మొద‌టి మ‌హిళ మ‌ల్లు స్వ‌రాజ్యం (Mallu Swarajyam)చ‌రిత్ర సృష్టించారు.

ఆమె వ‌య‌సు 91 ఏళ్లు. స్వంతూరు సూర్యాపేట జిల్లా తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గం క‌రివిరాల కొత్త‌గూడెం. భూసామ్య కుటుంబంలో పుట్టారు. వంద‌లాది ఎక‌రాల భూమి క‌లిగిన భూసామ్య కుటుంబం ఆమెది.

1945 -46 సంవ‌త్స‌రంలో జ‌రిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం స‌ర్కారు గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించిన వ్య‌క్తిగా గుర్తింపు పొందారు మ‌ల్లు స్వ‌రాజ్యం. ఆనాడు క‌క్ష గ‌ట్టిన నైజాం గూండాలు ఆమె ఇంటిని త‌గుల బెట్టాయి.

సాయుధ పోరాటంలో భాగంగా ఆనాటి ఆదిలాబాద్ , వ‌రంగ‌ల్ ,క‌రీంన‌గ‌ర్ జిల్లాల్లో ప‌ని చేశారు. దొర‌ల దురహంకారంపై పాట‌ల‌తో చైత‌న్య‌వంతం చేశారు. మ‌హిళా క‌మాండ‌ర్ గా కూడా ప్రూవ్ చేసుకున్నారు.

ఆనాడు ఆమెను ప‌ట్టిస్తే 10 వేల రూపాయ‌ల బ‌హుమ‌తి ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది నైజాం ప్ర‌భుత్వం. త‌న పొలంలో పండిన ధాన్యాన్ని పేద‌ల‌కు పంచిన యోధురాలు. ఆమె భ‌ర్త న‌ర్సింహారెడ్డి సీపీఎం నాయ‌కుడు. సోద‌రుడు మిర్యాల‌గూడ ఎంపీగా గెలుపొందారు.

ఏపీ ఉమ్మ‌డి రాష్ట్రంలో తుంగ‌తుర్తి నుంచి ఎమ్మెల్యేగా ప‌ని చేశారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. మ‌ద్య‌పాన వ్య‌తిరేక పోరాటంలో మ‌ల్లు స్వ‌రాజ్యం కీల‌క పాత్ర పోషించారు.

జాతీయ స్థాయిలో నాయ‌కురాలిగా ప‌ని చేశారు. ఆమెకు కూతురు, ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. మ‌ల్లు స్వ‌రాజ్యం(Mallu Swarajyam) మృతితో గొప్ప యోధురాలిని , ధీశాలిని కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్.

Also Read : అమెరికా టూర్ కు కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!