TS TET :తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ప్రధానంగా టీచర్ల ఎంపిక కోసం ప్రాథమిక అర్హతగా నిర్ణయించిన రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష – టెట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
గతంలో టీచర్లు కావాలంటే టెట్(TS TET) తప్పనిసరి చేసింది. ఒకవేళ టెట్ లో గనుక అర్హత పొందనట్లయితే రాష్ట్రంలో నిర్వహించే ఏ టీచర్ పోస్టుకు అర్హులు కారు. దీంతో టెట్ కోసం భారీ పోటీ ఏర్పడింది.
ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన టెట్ ఈరోజు వరకు తెలంగాణ ఏర్పాటై 8 ఏళ్లు కావస్తున్నా నిర్వహించ లేక పోయింది సర్కార్. బాధ్యతా రాహిత్యానికి ఇది పరాకాష్టగా భావించవచ్చు.
టెట్ అభ్యర్థులకు సంబంధించి తీపి కబురు చెప్పింది. గతంలో టెట్ అర్హులైన వారికి కేవలం 7 సంవత్సరాలు మాత్రమే చెల్లుబాటు ఉండేది. ఆ నిర్ణయాన్ని రద్దు చేస్తూ కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది విద్యా శాఖ.
ఇక టీఎస్ టెట్ (TS TET)లో ఒక్కసారి అర్హులైతే ఆ సర్టిఫికెట్ జీవిత కాలం ఉద్యోగం వచ్చేంత వరకు చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేసింది.
అంతే కాకుండా 2011 ఫిబ్రవరి 11న రిలీజ్ చేసిన టెట్ మార్గదర్శకాల అనంతరం టెట్ అర్హత పొందిన వారికి కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
ఇందుకు సంబంధించి ప్రభుత్వ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించి పాఠశాల విద్యా సంచాలకులు, టెట్ కమిటీ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Also Read : తెలంగాణలో శాఖల వారీగా పోస్లులు ఇవే