Subhash Palekar : ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా కేవలం ఈ మట్టిని కాపాడు కోవాలని ప్రజలను చైతన్యవంతం చేస్తున్న సేంద్రీయ పితామహుడు సుభాష్ పాలేకర్. ప్రకృతిని ఆయన ప్రేమిస్తాడు. పచ్చదనం అంటే పడి చస్తాడు. పంటలను ఎదగనీయండి. వాటికి ప్రాణం ఉందంటారు. అంతేనా ఎరువులు వేసి కోట్లాది మందికి ఆహారాన్ని అందించే ఈ మట్టిని ఎందుకు నాశనం చేస్తున్నారని ప్రశ్నిస్తారు.
అంతేనా ఇప్పటికే లక్షలాది మంది రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించిన ఘనత ఆయనకే దక్కింది. వేలాది సమావేశాలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ఒకసారి స్టార్ట్ చేశారంటే ఇక ఆపడం ఎవరి తరమూ కాదు. అంతలా ఈ మట్టితో మమేకమై పోయారు సుభాష్ జీ. రసాయిన ఎరువులు, క్రిమి సంహారక మందులు లేకుండా ఆరోగ్య కరమైన అధిక ఉత్పత్తి ఎలా సాధించాలో చేసి చూపించిన ఘనుడు ఆయన.
అభివృద్ధి చేసిన వ్యవసాయ పద్ధతికి పాలేకర్ పాలసీగా ప్రాచుర్యం పొందింది. కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలు ప్రకృతి సేద్యానికి ప్రయారిటీ ఇస్తున్నాయి. ఇదంతా సుభాష్ పాలేకర్(Subhash Palekar )చలవ వల్లనే. 1949లో మహారాష్ట్రలోని బెలోరా గ్రామంలో పుట్టారు. వ్యవసాయంపై ఉన్న ప్రేమతో ఆ రంగంలో పట్టా సాధించారు. తండ్రితో పాటు తాను కూడా వ్యవసాయం చేయడం మొదలు పెట్టారు.
ఒకే ఒక్క దేశీ వాళీ ఆవుతో సుమారు 30 ఎకరాలలో మిశ్రమ పంటలను పండించ వచ్చని పాలేకర్ అంటారు. దేశీవాళి ఆవు పేడ, మూత్రం పంటలకు ఎంతో ముఖ్యమని చెబుతారు. ఇతర జంతువుల పేడ, మూత్రం మన ఆవులు ఇచ్చినంత ఫలితాన్ని ఇవ్వవంటారు. తన జీవితమంతా ప్రయాణాలు, సదస్సులు, ప్రసంగాలతోనే గడిచి పోతోంది. ప్రతి ప్రయాణం తనకు ఒక పాఠం నేర్పుతుందంటారు పాలేకర్.
ఆ విధంగా ఆయన తన అనుభవాలతో ఇప్పటి వరకు 50కి పైగా పుస్తకాలు రాశారు. ఏక బిగిన 12 గంటలకు పైగా ప్రసంగించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పెట్టుబడి లేకుండా సాగు చేయవచ్చనే ఆయన మాటలను తేలిగ్గా తీసుకున్నారు రైతులు. ఆయన చేసి చూపించే సరికి దారికి వచ్చారు. ప్రకృతి అన్నీ ఇస్తోంది. చెట్లు పెరుగుతున్నాయి.
ఎలాంటి మందులు లేకుండానే. మరి పంటలకు మందులు, ఎరువులు ఎందుకు అన్న ప్రశ్న ఉదయించింది. అదే సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లేలా చేసింది. సాదాసీదాగా ఉంటారు. ఖద్దరు దుస్తులు ధరిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే గాంధీ ఆయన. సాగు విధానంపై సలహాలు, సూచనలు ఇస్తారు. ఎక్కడికి రమ్మన్నా వస్తారు. సుభాష్ పాలేకర్ కృషి వల్ల దేశ వ్యాప్తంగా 50 లక్షల మందికి పైగా ఆయన పద్ధతలను అనుసరించి సాగు చేస్తున్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో కార్యాలయం ఉంది. అక్కడ రైతుకు 40 కేజీల విత్తనాలను ఉచితంగా ఇస్తారు. పాలేకర్ విధానాలకు ఆకర్షితులైన వారిలో వ్యాపారులు, ఇంజనీర్లు, రైతులు, యువత కూడా ఉన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో లక్ష మందికి పైగా రైతులు ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారు. పాలేకర్ నిజమైన మానవుడు కదూ.
No comment allowed please