#Tollywood : తొలిత‌రం సినిమా న‌టుడు బందా కనక లింగేశ్వరరావు

The Earlyest film actor was Banda Kanaka Lingeshwara Rao

Tollywood  : తెలుగు సినిమాల్లో మొట్టమొదటి కృష్ణ పాత్రధారి రఘురామయ్య (పృధ్వీపుత్ర: 1933; కుచేల: 1935). అయితే రెండో కృష్ణుడు బందా కనక లింగేశ్వరరావు (ద్రౌపదీ మానసంరక్షణం: 1936). నాటి నటులకు ముఖ్యమైన అర్హత చక్కని కంఠంతోపాటు పాట, పద్యం పాడడం. బందా రంగస్థలం మీద ఎన్నో పాత్రలు ధరించి పేరు తెచ్చుకొన్నా- ‘కృష్ణ పాత్ర ఆయన అభిమాన పాత్ర’ అని చెప్పుకొనే వారు. ‘చిత్ర నళీయం’ నాటకంలో బాహుకుడి పాత్రను అద్భుతంగా నటించేవారని పేరు. పలు రసాల రాగాల్లో పద్యాలు చదివేవారు.

బందావారు ధరించిన పాత్రల్లో ముఖ్యంగా చెప్పుకునేవిగా శ్రీక్రష్ణుడు, కాళిదాసు, బిల్వ మంగళుడు, సారంగ ధరుడు, శ్రీరాముడు, కర్ణుడు, నలుడు, బాహుకుడు, ప్రతాప రుద్రుడు, ‘కన్యాశుల్కం’లో గిరీశం, సలీమ్‌, అల్లూరి సీతా రామరాజు, చంద్రగుప్తుడు, విజయ రామరాజు (బొబ్బిలి యుద్ధం) పానుగంటి వారి ‘కంఠాభరణం’లో పిచ్చి రామశాస్త్రి, పేరిగాడు మొదలైనవి. రంగస్థల నటుల్లో వైవిధ్యమైన ఇన్ని పాత్రలు ధరించిన వాళ్లు తక్కువ. ఎవరు ఏ పాత్రలో పేరు తెచ్చుకుంటే ఆ పాత్రనే ప్రేక్షకులు ఎక్కువగా కోరుకునేవారు. కాని, బందా విషయంలో వేరుగా వుండేది. ఏ నాటకం వేసినా కనకలింగేశ్వరరావు ఉంటే చాలు- మంచి నటన, పద్యాలూ వుంటాయని జనం విరగ బడేవారు. కురుపాం జమీందారు ‘అభినవకృష్ణ’ అన్న బిరుదును, జయంపురం మహారాజా ‘నటశేఖర’ బిరుదునూ బందాకు ప్రదానం చేశారు.

తెలుగు టాకీ తొలి తరానికి చెందిన సినిమా నటుడు బందా కనక లింగేశ్వరరావు. సుప్రసిద్ధ రంగస్థల, సినిమా నటుడు, ఆకాశవాణి, నాటక ప్రయోక్త, నాట్యకళా పోషకుడు, కూచిపూడి కళాక్షేత్ర వ్యవస్థాపకుడు అయిన బందా కనకలింగేశ్వరరావు (జనవరి 20, 1907- డిసెంబరు 3, 1968 కృష్ణా జిల్లాలోని ఆటపాక గ్రామంలో జన్మించారు. ఆటపాకలో ప్రాథమిక విద్యాభ్యాసం, అనంతరం బందరు నోబుల్ కళాశాలలో చదివి, మద్రాసు లా కళాశాల నుండి 1932 లో బి.ఎల్. పట్టా పుచ్చుకున్నారు. 1934లో మొదట న్యాయవాదిగా పనిచేసి, తరువాతి కాలంలో తనకు సంతృప్తిని కలిగించే నాటక ప్రదర్శనమే వృత్తిగా చేసుకున్నారు. నాటకరంగంలో ప్రవేశించిన అనంతరం మొదట్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే అందివచ్చిన ప్రతిఒక్క పాత్రలో ఒదిగిపోతూ తన ప్రతిభను నిరూపించుకుంటూ దూసుకెళ్లారు. దర్శకులు ఏ పాత్ర ఇచ్చినా కాదనకుండా అందులో పూర్తి లీనమైపోయి తన ప్రతిభతో ముగ్ధుల్ని చేసేవారు. నాటకాలలో తనకు అత్యంత ఇష్టమైన బాహుకుడు, బిల్వ మంగళుడుతో పాటు, అనేక పాత్రలు పోషించారు. అయన ఏలూరులో 1938లో నాటక కళాశాలను స్థాపించి పలువురు నటులకు శిక్షణ ఇచ్చారు. ప్రభాత్ థియేటర్ అనే సంస్థను స్థాపించి నాటక ప్రయోక్తగా నూతన ప్రదర్శన రీతులను ప్రవేశపెట్టారు.

1937, ఫిబ్రవరి 5 విడుదలైన పి.పుల్లయ్య దర్శకత్వం వహించినతెలుగు చలనచిత్రంలో బందా… సారంగధరని పాత్ర పోషించారు. ఈ చిత్రంలో బందా కనకలింగేశ్వరరావు తో పాటు, అద్దంకి శ్రీరామమూర్తి, పులిపాటి వెంకటేశ్వర్లు, కొచ్చర్లకోట సత్యనారాయణ, శ్రీరంజని సీనియర్, కన్నాంబ, పి.శాంతకుమారి , బాలామణి తదితరులు నటించగా, ఆకుల నరసింహారావు సంగీతం అందించారు.

తెలుగు సినిమా ప్రపంచంలో మొదటి తరం సినిమాలైన…బాలనాగమ్మ (1942) లో కార్యవర్ధి రాజూ (బాలనాగమ్మ భర్త )గా, ద్రౌపదీ మాన సంరక్షణ (1936), పాడుకా పట్టభిషేకం (1945),సారంగధర 1937 తదితర సినిమాలలో నటించారు. కూచిపూడి నాట్యకళకు ఎనలేని సేవ చేశారు. ప్రభుత్వ సాయంతో కూచిపూడి గ్రామంలో సిద్ధేంద్ర కళాక్షేత్రం నెలకొల్పి నిర్వహించారు. కూచిపూడి నాట్య కళ గురించి ప్రముఖ పత్రికలలో వ్యాసాలు రాసి దాని ప్రాధాన్యాన్ని అందరికీ తెలియ జేశారు. 1956 లో ఆకాశవాణిలో నాటక ప్రయోక్తగా పనిచేసి వివిధ నాటకాలను, నాటికలను ప్రసారం చేశారు. నాయింట్లో కూడా ప్రవేశించినదే, గుక్కెడు నీళ్లు, పందిలి క్రింద, స్నేహ లతాదేవి తదితర కథలను భారతి, గృహలక్ష్మి, ప్రవాహ వాణి, విశాలాంధ్ర తదితర పత్రికలలో రాశారు. ఆటపాక గ్రామంలో ఒక శివాలయాన్ని, ఒక చెరువును తవ్వించడమే కాకుండా ఒక వేద పాఠశాలను కూడా స్థాపించారు.

ఆయన 1964 లో “కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు”ను పొందారు. ఉత్తమ నటనకు “రాష్ట్రపతి అవార్డు” లభించింది. ఆయనకు ఏడుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఆయన జన్మ శతాబ్ది ఉత్సవాలను హైదరాబాదులో 2006-07 సంవత్సరాలలో ఘనంగా నిర్వహించారు. బందా కనక లింగేశ్వరరావు 1968 డిసెంబర్ 3 న మరణించారు.

No comment allowed please