#BVittalacharya : జానపద చిత్ర బ్రహ్మ బి.విఠలాచార్య

B Vittalacharya : పాతతరం, కొత్తతరం తరం ఎదైనా తెలుగు సినిమా ప్రేక్షకులకు బి.విఠలాచార్య పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదంటే అతిశయోక్తి కాదేమో.

B Vittalacharya : పాతతరం, కొత్తతరం తరం ఎదైనా తెలుగు సినిమా ప్రేక్షకులకు బి.విఠలాచార్య పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదంటే అతిశయోక్తి కాదేమో.

నట సార్వభౌముడు నందమూరి, కత్తి వీరుడు కాంతారావు ను సినీ ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయే రీతిలో సినిమాలు తీసి, వారికి మాస్ ఫాలోయింగ్ కల్పించింది విఠలాచార్య(B Vittalacharya) అనడంలో అతిశయోక్తి కి తావే లేదేమో. మాయలూ, మంత్రాలూ, ఇంద్ర మహేంద్ర జాలాలు, మానవాతీత శక్తులు, టక్కుటమార విద్యలూ, క్షుద్ర శక్తులు, తన చిత్రాలలో చూపించే సాటి రాని మేటి ప్రతిభా శాలి ఆయన. ఒక చిత్రానికి, మరో చిత్రానికి పోలిక లేకుండా, చిత్ర విచిత్ర వినూత్న ఆలోచనలను సాకారం చేసిన అపూర్వ సన్నివేశాల సృష్టికర్త ఆయన. అందుకే విఠలాచార్య జానపద చిత్ర బ్రహ్మ గా సుపరిచితుడు. ఆయన సినిమాల్లో నటీ నటులే కాకుండా జంతువులు, పక్షులు, అపరిచిత రూపాలు పాత్ర దారులై ఉండడం విశేషం. దర్శకత్వ ప్రతిభకు తోడు, నిర్మాతగా ప్రేక్షకులను ఆకర్షించే సెట్టింగులను రూపొందించడం ప్రత్యేకం.

బి.విఠల ఆచార్య లేదా బి.విఠలాచార్య (జనవరి 20, 1920 – మే 28, 1999) ‘జానపద బ్రహ్మ’ అని పేరు పొందిన తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత. తెలుగు, తమిళ, కన్నడ భాషలలో 70 చిత్రాలను రూపొందించిన ఆయన 1920 జనవరి 28 న కర్ణాటకలో ఉడిపిలో జన్మించారు. కొంతకాలం సర్కస్ కంపెనీలో జంతువుల ఆలనా పాలనా చూడడం చేత వాటిని తన చిత్రాలలో ఎలా వినియోగించు కోవాలో తర్ఫీదు పొందాడు. ఆయన ఎన్నో జానపద చిత్రాలకు అద్భుతమైన దర్శకత్వం వహించాడు. అప్పటి పరిమితమైన సాంకేతిక పరిజ్ఙానముతో ఆయన చూపించిన ప్రతిభ అసామాన్య మైనది. చాలా కొద్ది ఖర్చుతో ఆయన కనుల కింపైన జానపద కళా ఖండాలను రూపొందించాడు. 1942 లో చిత్రరంగ ప్రవేశము చేసిన ఆయన నిర్మాతగా డి.శంకర్ సింగ్ తో కలిసి దాదాపు 18 చిత్రాలను తమ మహాత్మా పిక్చర్స్ పతాకముపై నిర్మించారు. వీటిలో సాంఘిక చిత్రాలే అధికం.

తొలిసారిగా తెలుగులో 1953లో షావుకారు జానకి ప్రధాన పాత్ర పోషించిన కన్యాదానం చిత్రానికి దర్శకత్వము వహించాడు. క్రమంగా తెలుగులో నిర్మాతగా, దర్శకునిగా కూడా రాణించి అనేక జానపద చిత్రాలను తీశాడు. అయన దర్శకత్వం వహించిన చిత్రాలలో 15 చిత్రాలు నందమూరి తారక రామారావు నటించినవే అందులో 5 చిత్రాలను విఠలాచార్యే స్వయంగా నిర్మించాడు.

ఆయన చిత్రాలలో హేతుబద్ధతకు తావే లేదు. ‘అదెందుకు, ఎలా జరిగింది?’ అన్న ప్రశ్నలు ఉత్పన్నం కావు. ప్రేక్షకులను ఆహ్లాద పరచడమే ముఖ్యం. తెలుగు చందస్సుకు సంబంధించిన “యమాతారాజభానసలగం” అనే సూత్రాన్ని రాజనాల మాంత్రికుని తాంత్రిక మంత్రంగా పెట్టినా, ప్రేక్షకులు ఆనందించారు, ఆదరించారు. అందుకే ప్రజల నాడిని, వారు ఇష్టపడే అంశాలను దొరికి పుచ్చుకుని, ట్రిక్కులు చేయించడంలో అందె వేసిన చేయిగా ఖ్యాతిని గడించాడు. సినిమా నిర్మాణంలో ‘పొదుపు’ను ఎలా చేయాలో, అతి తక్కువ ఖర్చుతో ఎలా సినిమా నిర్మించాలో ఆయనకు తెలిసినంత మరెవరికీ తెలియదేమో. అలా వ్యాపారాత్మక చిత్రాలు చేసి విజయం సాధించి, ఆ కళలో తనకు ఎవరూ సాటి రారని రుజువు చేసుకున్నాడు. ఎన్నెన్నో దృశ్యాలు…అన్నీ ఒకే ఒక సెట్లో ఇమిడి పోయేవి. సామాన్య జనానికీ, సినిమా చూట్టంలో లీనమైపోయే ప్రేక్షకులకు ఈ తేడాలు అక్కర్లేదని విఠలాచార్య(B Vittalacharya) విశ్వసించేవారు. అలాగే కాస్ట్యూమ్స్‌, ఆభరణాలూ, ప్రతి సినిమాకీ మార్చవలసిన అవసరం లేదు ముఖ్యపాత్రకి తప్ప అని నమ్మి చేసి చూపించాడు. ‘నటీనటుల కాల్‌ షీట్లు గల్లంతైతే, వాళ్లని చిలకలుగానో, కోతులుగానో మార్చడం ఆయనకే చెల్లింది’ అని ఒక సందర్భంలో కాంతారావు వివరించాడు.

కన్యాదానం (1955), పెళ్ళి మీద పెళ్ళి (1959), కనకదుర్గ పూజా మహిమ (1960), బందిపోటు (1963), అగ్గి బరాటా (1966), చిక్కడు దొరకడు (1967), నిన్నే పెళ్ళాడుతా (1968) – ఈ చిత్రానికి కథ, చిత్రానువాదం, బి.విఠలాచార్య, దర్శకత్వం బి.వి.శ్రీనివాస్; భలే మొనగాడు (1968), ఆలీబాబా 40 దొంగలు (1970), లక్ష్మీ కటాక్షం (1970), విజయం మనదే (1970), రాజకోట రహస్యం (1971), జగన్మోహిని (1978), గంధర్వ కన్య (1979), మదన మంజరి (1980) తదితర చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

విఠలాచార్య ఎంతో దక్షతా, బాధ్యతా గల నిర్మాత. నటీ నటులకు, టెక్లీషియన్లకు తాను ఇస్తానన్న మొత్తాన్ని విభజించి ప్రతినెలా ఒకటో తేదీకల్లా – చిన్నా, పెద్దా అందరికీ చెక్కులు అందించడం ఆయనకే చెల్లింది. టైముకి ముందుగానే షూటింగ్‌ పూర్తిచేసి, అనుకున్న తేదీకి సినిమా విడుదల చెయ్యడం ఆయనకే సాధ్యమైంది. అలాగే నటీనటులకి కాల్‌ షీట్స్‌ అడ్జస్ట్‌ చెయ్యడంలో కూడా ఆయన ‘నంబర్‌వన్‌’ అనిపించు కునేవాడు. ముందుగా చెబుతే, ఒప్పుకున్న డేట్స్‌ని అటూ, ఇటూగా మార్చి చిన్న, పెద్ద నటీనులందిరికీ, సహాయపడేవాడు. వేషాలకోసం ఆఫీసులకి వెళ్తే విఠలాచార్య వచ్చిన ప్రతీ ఒక్కరినీ తన గదిలోకి పిలిచి, కూచోబెట్టి కాఫీ ఇచ్చి మాట్లాడి పంపించే వాడు. ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న జానపద చిత్ర బ్రహ్మ 1999, మే 28 న 80 యేళ్ల వయసులో మద్రాసులోని కన్ను మూశారు.

No comment allowed please