Tejasvi Surya : భారతీయ జనతా పార్టీ యువ మోర్చా చీఫ్ , ఎంపీ తేజస్వి సూర్యతో పాటు ఇతర బీజేపీ నాయకులను రాజస్థాన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దౌసా సరిహద్దు వద్ద వారిని అడ్డుకున్నారు.
ఇటీవల అల్లర్లు చోటు చేసుకున్న హిట్ కరౌలిని సందర్శించేందుకు వెళుతుండగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. తేజస్వి సూర్యతో(Tejasvi Surya) పాటు బీజేపీ రాజస్థాన్ చీఫ్ సతీష్ పూనియా కూడా అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.
ఇక్కడ జరిగిన అల్లర్లలో పలువురికి చెందిన షాపులు, నివాసాలు దగ్ధమయ్యాయి. నగరంలో వారం రోజుల పాటు కర్ఫ్యూ కూడా విధించారు.
ఇందులో భాగంగా తాను వస్తున్నానని, మీరంతా పెద్ద ఎత్తున రావాలంటూ ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు ఎంపీ తేజస్వి సూర్య(Tejasvi Surya). తనతో పాటు కార్యకర్తలు, నాయకులు కూడా హాజరు కావాలంటూ కోరారు.
ఇదే సమయంలో మీరు దేశం కోసం పోరాడేందుకు సిద్దంగా ఉన్నారా అంటూ ప్రశ్నించారు. ఏది ఏమైనా ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే, పోలీసులు తమను అడ్డుకున్నా సరే తాము వెళ్లి తీరుతామంటూ స్పష్టం చేశాడు తేజస్వి సూర్య.
అక్కడికి వెళ్లకుండా పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అల్లర్లు జరిగిన ప్రాంతాన్ని సందర్శించకుండా బీజేపీని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం నిషేధించిందని , తాను అక్కడికి చేరుకునేంత దాకా ఊరుకోనని హెచ్చరించారు.
ఆయన పిలుపు అందుకున్న మద్దతుదారులు బారికేడ్లను దాటి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Also Read : కర్ణాటక మంత్రి ఈశ్వరప్పపై కేసు