Mekapati Sucharitha : గత కొన్ని రోజుల నుంచి ఏపీలో చర్చనీయాంశంగా మారిన మాజీ హోం శాఖ మంత్రి మేకపాటి సుచరిత (Mekapati Sucharitha) ఎట్టకేలకు నోరు విప్పారు. తాను లేఖ పంపితే రాజీనామా లేఖ అంటూ తప్పుడు ప్రచారం చేశారంటూ ఆరోపించారు.
ఇది రాజకీయాలలో ఉన్న వారికీ , ఇతరులకు మంచి పద్దతి కాదని సూచించారు ఆమె. తాను పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా మండిపడ్డారు.
అవన్నీ కట్టుకథలేనని కొట్టి పారేశారు మేకపాటి సుచరిత. తాడేపల్లిగూడెంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డితో బుధవారం ఆమె భేటీ అయ్యారు.
దాదాపు వీరిద్దరి మధ్య గంటన్నర సేపు సమావేశం జరిగింది. భేటీ అనంతరం మేకపాటి సుచరిత మీడియాతో మాట్లాడారు. కొందరు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు పార్టీలో ఎలాంటి అవమానం జరగలేదని చెప్పారు. జెడ్పీటీసీ స్థాయి నుంచి హోం శాఖ మంత్రి ఉన్నత పదవి దాకా సీఎం జగన్ రెడ్డి తనకు అవకాశం ఇచ్చారని ఇంతకంటే ఇంకేం కావాలన్నారు.
గతంలో ప్రభుత్వం కొలువు తీరిన సమయంలోనే తనకు మంత్రి పదవిని మారుస్తామని ముందే చెప్పారని తెలిపారు. ఇదిలా ఉండగా కొన్ని రోజులుగా తనకు అనారోగ్య సమస్యలు ఉండడం వల్ల బయటకు రాలేక పోయానని చెప్పారు.
ఇక పార్టీ పరంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించినా తాను స్వీకరించేందుకు సిద్దంగా ఉన్నానని మేకపాటి సుచరిత స్పష్టం చేశారు. జగన్ మాటే తనకు శిరోధార్యమని ఆమె మరోసారి కుండ బద్దలు కొట్టారు.
Also Read : బియ్యం వద్దనుకుంటే నగదుకు ఓకే