Manish Sisodia : కేంద్రం కావాలని ఢిల్లీ సర్కార్ తో కయ్యానికి కాలు దువ్వుతోందంటూ ఆప్ సీనియర్ నాయకుడు, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా(Manish Sisodia ). ప్రస్తుతం బుల్డోజర్లతో బద్నాం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు.
బుధవారం సిసోడియా మీడియాతో మాట్లాడారు. 15 ఏళ్లుగా లంచాలు తీసుకున్న భారతీయ జనతా పార్టీకి చెందిన నేతల ఇళ్లను ఎందుకు కూల్చి వేయలేక పోయారని ప్రశ్నించారు.
ఈ అక్రమ నిర్మాణాలకు ఎవరు పర్మిషన్ ఇచ్చారో వారిని బాధ్యులు చేయాలని స్పష్టం చేశారు. వాటికి లైన్ క్లియర్ చేసిన బీజేపీ నేతలపై కదా ముందు బుల్డోజర్లను ప్రయోగించాల్సింది అంటూ నిప్పులు చెరిగారు సిసోడియా.
ఆ పార్టీకి చెందిన వారే లంచాలు తీసుకుని ఆక్రమణలకు అనుమతి ఇస్తున్నారంటూ డిప్యూటీ సీఎం తీవ్ర ఆరోపణలు చేశారు. వాయువ్య ఢిల్లీలోని జహంగీర్ పురిలో హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా చోటు చేసుకున్న హింసాకాండలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఈ ప్రాంతంలో కూల్చి వేసిన ఆక్రమణలకు బీజేపీయే కారణమని సిసోడియా (Manish Sisodia )మండిపడ్డారు. ఈ కూల్చి వేతలను ఆయన ఓ డ్రామాగా అభివర్ణించారు. తమ పార్టీకి చెందిన నాయకులపై బుల్డోజర్లను ఎప్పుడు ప్రయోగిస్తుందో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆ నేతల ఇళ్లను కూడా కూల్చి వేయండి అని అన్నారు డిప్యూటీ సీఎం. బుల్డోజర్లను ప్రయోగించడాన్ని తాత్కాలికంగా నిలిపి వేసింది సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.
తదుపరి విచారణ కొనసాగేంత వరకు కూల్చడాన్ని ఆపి వేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
Also Read : పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై నిషేధం