Ajay Maken : రోమ్ తగులబడి పోతుంటే చక్రవర్తి ఫిడేల్ వాయిస్తున్నట్లుగా ఉంది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పరిస్థితి అని ఎద్దేవా చేసింది కాంగ్రెస్.
ఓ వైపు ఆక్రమణల కూల్చివేత పేరుతో బుల్డోజర్లు కూల్చేస్తూ వెళుతుంటే బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ఎక్కడా కనిపించడం లేదంటూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్ (Ajay Maken) ఆరోపించారు.
జహంగీర్ పూరిలో ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఇప్పటికే 24 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురిని కీలకమైన వ్యక్తులుగా గుర్తించి అరెస్ట్ చేశారు.
ఈ తరుణంలో ఆక్రమణలు ఉన్నాయంటూ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఆదేశాలు ఇవ్వడం, బుల్డోజర్లు రావడం అదే పనిగా కూల్చేస్తూ వెళ్లడం జరిగి పోయింది.
దీనిపై బాధితులు కోర్టుకు ఎక్కారు. సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం వెంటనే కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయినా పట్టించు కోలేదు.
రెండు గంటల పాటు ఒక వర్గానికి చెందిన వారికి చెందిన దుకాణాలు, ఇళ్ల కాంపౌండ్ లను కూల్చేస్తూ వెళ్లారు. గురువారం కోర్టు మరోసారి తాము తీర్పు చెప్పేంత దాకా కూల్చ కూడదంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
దీనికి సంబంధించి ప్రతిపక్షాలు ఇది కక్ష పూరిత, విద్వేషంతో కూడుకున్న చర్యగా అభివర్ణించాయి. ఢిల్లీలో ఇంత జరుగుతున్నా ఎందుకు నోరు మెదపడం లేదంటూ సీఎంను నిలదీశారు మాకెన్.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చడం చట్ట విరుద్దమన్నారు. బాధ్యత కలిగిన సీఎం నిద్ర పోతున్నారా అంటూ నిలదీశారు.
Also Read : భారత్ తో మైత్రీ బంధానికే ప్రయారిటీ – జాన్సన్